కరెంట్ కోతలుండొద్దు.. నిర్లక్ష్యం చేస్తే ఐఏఎస్‌‌లనూ సస్పెండ్ చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి

కరెంట్ కోతలుండొద్దు.. నిర్లక్ష్యం చేస్తే ఐఏఎస్‌‌లనూ సస్పెండ్ చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి
  • ఎక్కడా పంటలు ఎండిపోవద్దు.. వచ్చే 20 రోజులు అప్రమత్తంగా ఉండాలి
  • నిర్లక్ష్యం చేస్తే ఐఏఎస్‌‌లనూ సస్పెండ్ చేస్తా: సీఎం రేవంత్​రెడ్డి
  • నైనీ, మహానది లింకేజీ ఉన్నా బొగ్గు కొరత ఎందుకు వస్తున్నది?
  • యాదాద్రి పవర్​ ప్లాంట్లో విద్యుత్​ ఉత్పత్తి పెంచాల్సిందే
  • ఎల్‌‌నినో కూడా కరోనాలాంటి విపత్తే!
  • తాగునీరు, పశుగ్రాసం కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి
  • నీరు, విద్యుత్​ పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
  • అత్యవసర రివ్యూలో ముఖ్యమంత్రి ఆదేశాలు
  • నేడు ఎల్​నినోపై సెక్రటేరియెట్​లో మంత్రులతో సమావేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా కరెంట్​ కోతలుండొద్దని స్పష్టం చేశారు. కరెంట్ సప్లై సాఫీగా సాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఎన్నిసార్లు చెప్పినా అధికారుల పనితీరులో మార్పు ఎందుకు రాలేదని మండిపడ్డారు. కరెంట్​ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని, అవసరమైతే విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్, జెన్‌‌కో సీఎండీ సహా సంబంధిత విభాగపు ఐఏఎస్ అధికారులనూ సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.

రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌‌నినో ప్రభావం, తాగునీరు, విద్యుత్ సరఫరాపై సీఎం బుధవారం ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లాలవారీగా ప్రస్తుత పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రైతులకు పంటలు చేతికొచ్చే వరకు విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. వచ్చే 20 రోజులు పంటలకు అత్యంత కీలకమైనందున కరెంట్ కోతలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

విద్యుత్​ ఉత్పత్తి ఎందుకు పెంచట్లేదు?
రాబోయే రోజుల్లో విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని తెలిసినప్పటికీ ఉత్పత్తిని పెంచేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. బొగ్గు కొరత రాకుండా నైనీ, మహానది నుంచి బొగ్గు సరఫరాకు లింకేజీ ఏర్పాట్లు పూర్తి చేసినా, యాదాద్రి పవర్ ప్లాంట్‌‌లో పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు.

"ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది నేను. పంటలను కాపాడేందుకు విద్యుత్ ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా అధికారులు పెడచెవిన పెట్టారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదు" అని తేల్చి చెప్పారు. వ్యవసాయానికి విద్యుత్ అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ముందే గుర్తించి సరఫరాను పెంచాలని సూచించారు.

ముందస్తు చర్యలు చేపట్టకపోతే సంక్షోభమే
ఎల్‌‌నినో ప్రభావాన్ని కరోనాలాంటి విపత్తుగా పరిగణించి అన్ని ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు.  ఈ పరిస్థితి ఎప్పటివరకు ఉంటుందో ఎవరికీ తెలియదని..ముందస్తు చర్యలు చేపట్టకపోతే తీవ్ర సంక్షోభంగా మారుతుందని హెచ్చరించారు. అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో ఎల్‌‌నినో ప్రభావాన్ని లోతుగా అంచనా వేయాలని.. సమస్యలకు పరిష్కార మార్గాలను గుర్తించి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. వచ్చే జూన్ వరకు ప్రతి శాఖ పకడ్బందీ యాక్షన్ ప్లాన్ రూపొందించి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా ముందస్తు ప్రణాళికలతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మాణ రంగంతో పాటు ఇతర అవసరాలకు మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో (ఎస్టీపీలు) శుద్ధి చేసిన నీటిని మాత్రమే వినియోగించేలా చూడాలన్నారు. ఎల్‌‌నినో ప్రభావంతో పశువులకు పశుగ్రాసం కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మండలాల్లో గ్రూప్​–1 అధికారులు 
ఎల్‌‌నినో ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి గ్రూప్–1, గ్రూప్–2 స్థాయి అధికారులను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆయా మండలాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సీఎస్ కు నేరుగా నివేదికలు అందించేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఎల్‌‌నినో ప్రభావంతో రాబోయే సంక్షోభ పరిస్థితులపై గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఇందుకోసం దసరా తర్వాత దీపావళి వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించాలని ఆదేశించారు.

కళాజాత ద్వారా ప్రజలకు ఎల్‌‌నినో ప్రభావాన్ని వివరిస్తూ.. నీరు, విద్యుత్ పొదుపుతో పాటు భవిష్యత్తు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్యవంతం చేయాలన్నారు. కాగా, ఎల్‌‌నినో ప్రభావం, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై మరింత లోతుగా చర్చించేందుకు గురువారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.