
- ఐడియాలజీ, కమిట్‌మెంట్‌కు కట్టుబడేవాళ్లు తగ్గుతున్నరు
- ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం: సీఎం రేవంత్రెడ్డి
- వర్సిటీల నుంచి మళ్లీ సిద్ధాంతపర రాజకీయాలు రావాలి
- ప్రజలకు నిరసన తెలిపే చాన్స్ ఇవ్వొద్దనే విధానం మంచిదికాదు
- గత సర్కార్ ధర్నాచౌక్‌ను ఎత్తేస్తే మేం తెరిపించినం
- నేను సీఎం అయినప్పటి నుంచి ఎవరినీ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయలే
- ప్రతిపక్షాలు చెప్పాలి.. అధికారపక్షం వినాలి.. అందుకే అసెంబ్లీ పనిదినాలు పెంచినం
- జైపాల్‌రెడ్డి సహకారం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు
- ఆయనకు రాజకీయ ప్రత్యర్థులు తప్ప శత్రువులు లేరని వెల్లడి
- ‘జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డు’ ప్రదానోత్సవానికి హాజరు
హైదరాబాద్, వెలుగు: దేశ రాజకీయాల్లో ధన ప్రభావం పెరిగి ప్రజాస్వామిక స్ఫూర్తికి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ధన ప్రభావం తగ్గి విలువలతో కూడిన సిద్ధాంతపరమైన రాజకీయాలు రావాలని ఆకాంక్షించారు. ‘‘ఇప్పుడు సిద్ధాంత పరమైన రాజకీయాలు కాకుండా ఎవరెంత వేగంగా డెలివరీ చేస్తారన్న ‘స్విగ్గీ పాలిటిక్స్’ తెరమీదకొచ్చాయి.. ఎవరు ఎంత వేగంగా ఆన్‌లైన్‌లో డెలివరీ చేస్తారు.. మనకు కావాల్సింది ఎవరు తొందరగా ఇస్తారు.. అనేదానిపైనే ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్నాయి.. ఐడియాలజీ, కమిట్‌మెంట్‌కు కట్టుబడే వారు తగ్గిపోతున్నారు.. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకర పరిణామం’’ అని సీఎం పేర్కొన్నారు.
చిన్నారెడ్డి లాంటి సీనియర్ లీడర్లు కొందరు ఉన్నారుగానీ పొలిటికల్ మేనేజర్స్ ఎక్కువైపోయారని.. కార్యకర్తలు పోయి, వలంటీర్లు వచ్చారని, కార్యకర్తలు లేని రాజకీయాలు దేశ భవిష్యత్తుకు ప్రమాదకరంగా తయారవుతాయని హెచ్చరించారు. యూనివర్సిటీల నుంచి సిద్ధాంతపరమైన రాజకీయాలు మళ్లీ రావాలని, దేశ రాజకీయాల్లో ధన ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్స్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన 'జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డు' ప్రదానోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ప్రముఖ ఆర్థిక నిపుణుడు మోహన్ గురుస్వామికి ‘జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డు’ను ప్రదానం చేశారు. అనంతరం సీఎం మాట్లాడారు.
అసెంబ్లీ పనిదినాలు పెంచినం
వ్యక్తిగత వైరుధ్యాల కంటే సిద్ధాంతపరమైన భిన్నాభిప్రాయాలకు రాజకీయాల్లో స్థానం ఉండాలని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. అందుకే తాము అసెంబ్లీలో ఎక్కువ పనిదినాలను పెంచుకుంటూ వస్తున్నామని తెలిపారు. తాను సీఎం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరినీ సభ నుంచి సస్పెండ్ చేయలేదని.. ప్రతిపక్షాలు చెప్పాల్సినవి ఏదైనా చెప్పడానికి, తాము వినడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ‘‘పార్లమెంట్ డెమోక్రసీని నేను సంపూర్ణంగా విశ్వసిస్తా. వాళ్లు(ప్రతిపక్షాలు) చెప్పాలి.. వాళ్లు సహేతుకమైన సూచన చేసినా, సలహా ఇచ్చినా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సవరించుకోవడంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు’’ అని స్పష్టం చేశారు.
జైపాల్‌రెడ్డికి శత్రువులు లేరు
కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి నిలువెత్తు శిఖరం అని సీఎం రేవంత్రెడ్డి కొనియాడారు. ‘‘తెలంగాణ రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో పీవీ నరసింహారావు స్ఫూర్తితో పాటు జైపాల్‌రెడ్డి స్ఫూర్తి కూడా ఉండాలి. రాష్ట్ర ఏర్పాటులో జైపాల్‌రెడ్డి పాత్రను ఎవరూ విస్మరించలేరు. జైపాల్‌రెడ్డి లేకపోతే, ఆయన సహకారం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదు” అని అన్నారు. లోక్‌సభ, రాజ్యసభలో తెలంగాణ బిల్లును ఆమోదింపజేయడంలో జైపాల్‌రెడ్డి అత్యంత కీలక పాత్ర పోషించారని తెలిపారు. ‘‘జైపాల్‌రెడ్డికి రాజకీయ ప్రత్యర్థులే తప్ప, శత్రువులు ఎవరూ లేరు. సిద్ధాంతపరమైన విభేదాలతోనే ఆయన రాజకీయాలు నడిపారు. కేంద్ర కేబినెట్‌లో రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను 45 నిమిషాల పాటు వివరించి, సోనియా గాంధీని జైపాల్ రెడ్డి ఒప్పించారు. ‘జైపాల్ రెడ్డి ఇనిషియేషన్ వల్ల ఐ హ్యావ్ ఇంక్లైన్ టు అనౌన్స్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ’ అని సోనియా గాంధీ స్వయంగా నాతో చెప్పారు” అని సీఎం రేవంత్రెడ్డి వివరించారు.
రాష్ట్ర సాధనలో జైపాల్ రెడ్డి పాత్రను స్వరాష్ట్రంలో సరిగ్గా గుర్తించకపోయినా, పక్క రాష్ట్రానికి చెందిన ఉండవల్లి అరుణ్ కుమార్ తన పుస్తకంలో స్పష్టంగా వివరించారని ఆయన అన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి నుంచి లాల్‌కృష్ణ అద్వానీ, సుష్మా స్వరాజ్ వరకు దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థులు, సిద్ధాంత విభేదాలు మాత్రమే ఉండేవని, వ్యక్తిగత వైరం ఎప్పుడూ లేదని పేర్కొన్నారు. ‘‘జైపాల్ రెడ్డి కేవలం సమస్యల పరిష్కారానికి కాకుండా, విధానపరమైన మార్పులకు కృషి చేశారు. ఒక రేషన్ కార్డు సమస్య వస్తే దాన్ని ఎలా ఇప్పించాలని ఆలోచించకుండా.. ఆ విధానాన్ని సరళీకృతం చేసి పేదలకు ఎలా మేలు చేకూర్చాలని ఆలోచించే వారు. ఆయన కల్వకుర్తి ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు” అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు.
వాళ్లు ధర్నాచౌక్‌ను ఎత్తేస్తే.. తెరిపించినం
ఎదురు ఉండేవాళ్లు మాట్లాడనే వద్దు.. ప్రజలకు నిరసన తెలిపే అవకాశమే ఇవ్వద్దు.. అనే విధానం ఏ మాత్రం మంచిది కాదు” అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఉద్యమాలకు వేదికైన ధర్నా చౌక్‌ను గత సర్కార్ క్లోజ్ చేస్తే.. తాను సీఎం అయిన వెంటనే తిరిగి తెరిపించి, ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి అవకాశం కల్పించామని రేవంత్ పేర్కొన్నారు. విధాన నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తామన్నారు.