మీ తప్పులు సరిదిద్దడానికే ఢిల్లీకి వచ్చిన.. కేంద్రం దగ్గర కాకపోతే మీ ఫామ్హౌస్ల చర్చిస్తమా?

మీ తప్పులు సరిదిద్దడానికే ఢిల్లీకి వచ్చిన.. కేంద్రం దగ్గర కాకపోతే మీ ఫామ్హౌస్ల చర్చిస్తమా?
  • బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్​రెడ్డి కౌంటర్​
  • ఏపీకి కృష్ణా నీళ్లను అప్పనంగా అప్పజెప్పిందే కేసీఆర్​
  • బీఆర్ఎస్​ పాలనలో 1,200 టీఎంసీలు ఏపీ ఎత్తుకెళ్లింది
  • రాయలసీమను రత్నాల సీమ చేస్తమని చెప్పిందెవరు?
  • ఇప్పుడు మేం టెలిమెట్రీలు పెట్టిస్తే తప్పెట్ల అయితది?
  • బనకచర్లపై చర్చ జరగలేదని కేంద్రమే చెప్పింది
  • సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తం
  • బీసీల రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించిందే కేసీఆర్
  • ఫార్ములా సహా పలు కేసులను చూస్తున్న ఈడీ కేటీఆర్​ను ఎందుకు అరెస్ట్​ చేస్తలే
  • దీనికి  కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఏం సమాధానం చెప్తరు?
  • కేటీఆర్​, కవితకు నడుమ అధికారం, ఆస్తుల పంచాదీ
  • గంజాయి బ్యాచ్ సవాళ్లకు స్పందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్య

న్యూఢిల్లీ, వెలుగు: కృష్ణా, గోదావరి జలాల విషయంలో పదేండ్ల పాలనలో బీఆర్​ఎస్​ చేసిన తప్పులను సరిదిద్దేందుకే సీఎంగా తాను, ఇరిగేషన్​ మంత్రిగా ఉత్తమ్​ ఢిల్లీకి వచ్చి అటు కేంద్రంతో, ఇటు ఏపీతో చర్చిస్తున్నామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ఢిల్లీల కాకపోతే మీ ఫామ్​హౌస్​కు వెళ్లి ఈ విషయాలు చర్చించలేం కదా? అని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. ‘‘2015-– 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్​లో సీఎం హోదాలో కేసీఆర్.. చంద్రబాబుతో భేటీ అయిండు. ఆనాడు గోదావరి నుంచి సముద్రంలోకి 3 వేల టీఎంసీలు పోతున్నాయని, వాటిని సీమకు మళ్లించుకోవాలని బాబుకు చెప్పిండు.  మీటింగ్​ తర్వాత బయటకు వచ్చి విజయం సాధించినట్లు చెప్పుకున్నడు. ఆయన చర్చలు జరిపి, తెలంగాణకు ద్రోహం చేస్తే అది విజయం.. గత పదేండ్లపాటు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు మేం ప్రయత్నిస్తే  ద్రోహమా?’’  అని నిలదీశారు. గురువారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మంత్రి ఉత్తమ్, ఎంపీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. 

కేసీఆర్​.. రొయ్యల పులుసు తిని ఏమన్నవ్​? 

పదేండ్లపాటు బీఆర్ఎస్​ సర్కారు కండ్లు మూసుకోవడం వల్లే  శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా ఏపీ రోజుకు 4.1 టీఎంసీలకు బదులు 9.6 టీఎంసీలను మళ్లించుకుంటున్నదని సీఎం మండిపడ్డారు.  ‘‘2004 నుంచి -2014 వరకు పదేండ్ల కాంగ్రెస్ హయాంలో రాయలసీమకు  728 టీఎంసీలు పోతే.. 2014-  నుంచి 2023 వరకు కేసీఆర్​ పాలనలో  1,200 టీఎంసీలు తరలించుకుపోయారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి అనడానికి ఈ గణాంకాలు సరిపోవా?’’ అని ప్రశ్నించారు. ఇప్పుడు తాము టెలిమెట్రీలు ఏర్పాటు చేయించి శ్రీశైలం నీటి దోపిడీకి అడ్డుకట్ట వేయాలని భావిస్తుంటే అది తప్పెట్ల అవుతుందో చెప్పాలన్నారు.  ‘‘గోదావరి నీటిని రాయలసీమకు ఎట్ల మళ్లించాలో అప్పట్లో చంద్రబాబుకు, ఆ తర్వాత జగన్​కు సలహాలు ఇచ్చినవ్​. అప్పట్లో ఏపీలో ఒక మంత్రి  ఇంట్లో రొయ్యల పులుసు తిని అది అరగక ముందే రాయలసీమను రత్నాలసీమగా మార్చుతానంటూ మాట ఇచ్చినవ్​. అవన్నీ మరిచిపోయినవా?’’ అని కేసీఆర్​పై సీఎం రేవంత్ రెడ్డి​ ఫైర్​అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు పెంచి రాజకీయంగా బతుకుదామనుకుంటున్నారని విమర్శించారు. అధికారం పోయిందన్న బాధలో కడుపులో విషాన్ని నింపుకొని మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. 

మేం ఇంజనీర్లం కాదు.. పొలిటికల్​ ఎగ్జిక్యూటర్లం.. 

తాము ఫెడరల్​స్ఫూర్తిని గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యంగా ఉంటామని, తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకుంటామని సీఎం రేవంత్​ స్పష్టంచేశారు. తాజాగా జరిగిన సీఎంల భేటీతో తెలంగాణ భవిష్యత్ నీటి అవసరాలకు రోడ్ మ్యాప్ వేసినట్లు తెలిపారు. కృష్ణా, గోదావరి బేసిన్ లో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు, కొత్తగా చేపట్టే ప్రాజెక్టులు, వాటి నీటి కేటాయింపులు ఇకపై నూతన కమిటీ చూస్తుందన్నారు. ఈ కమిటీ లో పరిష్కారం కాని అంశాలను సీఎంల స్థాయిలో పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ఇచ్చంపల్లి-, కావేరి వయా శ్రీశైలం నదుల అనుసంధానం అంశం కేంద్రం ప్రతిపాదించిందన్నారు. ‘‘మేం ఇంజనీర్లం కాదు.. పొలిటికల్ ఎగ్జిక్యూటర్లం. సాంకేతికంగా, చట్టాలు అనుమతిస్తే ముందుకెళ్తాం. భవిష్యత్ అవసరాలు, సమాజంలో మార్పులు, టెక్నాలజీ దృష్టి పెట్టుకున్నాం’’  అని పేర్కొన్నారు. బనకచర్ల అంశం చర్చకు రాలేదని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందన్నారు. అయితే.. రెండు రాష్ట్రాల మధ్య గొడవలు జరిగితే బాగుండని బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ తీరుతో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందన్నారు.  

బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి ముంచిందే కేసీఆర్​

ఈ ఏడాది సెప్టెంబర్ 30 లోగా సర్పంచ్ మొదలు జెడ్పీ టీసీ వరకు అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు 30 రోజుల్లో రిజర్వేషన్లు, 90 రోజుల్లో ఎన్నికల నిర్వహణ పూర్తి చేస్తామన్నారు. ఆర్డినెన్స్ ఆమోదం కోసం అవసరమైతే గవర్నర్​ను కలుస్తామని చెప్పారు. ‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై మా దగ్గర వ్యూహం ఉంది. లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లను అమలు చేసి తీరుతాం. కొందరు ముసుగు వీరులు దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ల ఆటలు సాగనివ్వం’’ అని స్పష్టం చేశారు. వర్గీకరణ, కులగణన సర్వేపై కూడా విమర్శలు చేశారని తెలిపారు. ‘‘2014 కు ముందు లోకల్​బాడీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను కాంగ్రెస్ కల్పిస్తే.. దీన్ని 23 శాతానికి తగ్గించిందే కేసీఆర్. రిజర్వేషన్లు 50శాతం దాటకూడదని 2018 లో కేసీఆర్ పంచాయతీ రాజ్ చట్టాన్ని తెచ్చి బీసీలకు అన్యాయం చేసిండు. ఆ చట్టంలో ఇప్పుడు 50 శాతం క్యాప్ ను ఎత్తివేస్తూ..  ఆర్డినెన్స్ తెస్తున్నాం” అని పేర్కొన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు.. ప్రస్తుత ఆర్డినెన్స్ రెండు వేరని సీఎం తెలిపారు. ‘‘బీజేపీ  ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడని చెప్పుకునే లక్ష్మణ్​కే ఈ బిల్లు, ఆర్డినెన్స్​పై అవగాహన లేదు. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన బిల్లు ఉండగానే.. ఆర్డినెన్స్ ఎలా తెస్తారని ఆయన ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్ లో పెట్టేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని లక్ష్మణ్ కాగితంపై రాసి ఇస్తే... 48 గంటల్లో ప్రత్యేక సమావేశాలు పెట్టి కేంద్రానికి పంపుతాం. ఆర్డినెన్స్ ను ఎవరైనా సమర్థించాల్సిందే. అవసరమైతే ఆర్డినెన్స్ ఆమోదం కోసం గవర్నర్ ను కలిసి విజ్ఞప్తి చేస్త” అని ఆయన పేర్కొన్నారు. 

కేసీఆర్​ను కాపాడేందుకు కిషన్​రెడ్డి ప్రయత్నం

ఫోన్ ట్యాపింగ్ కేసును రాష్ట్ర హైకోర్టు సుమోటోగా తీసుకొని మానిటరింగ్ చేస్తున్నదని, అలాంటప్పుడు ఇతర కోర్టుల ప్రస్తావన ఎందుకని  సీఎం రేవంత్​రెడ్డి ప్రశ్నించారు.  ‘‘గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా తన ఫోన్ ట్యాప్ అయిందన్న కిషన్ రెడ్డి.. ఎందుకు ఫిర్యాదు చేయలేదో ప్రజలకు చెప్పాలి?  ప్రస్తు తం ఈ కేసులో కేసీఆర్​ను కాపాడేందుకే కేంద్రానికి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవ్వాలని బీజేపీ డిమాండ్​ చేస్తున్నది. కేంద్ర విదేశాంగ శాఖ, ఇతర శాఖల వల్లే ఈ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావును తీసుకురావడం ఏడాదిన్నర ఆలస్యమైంది. కానీ మేం కంటిన్యూగా ఫాలో అఫ్ చేసి ప్రభాకర్ రావును తీసుకొచ్చినం’’ అని ఆయన పేర్కొన్నారు. 

కేటీఆర్​ను ఈడీ ఎందుకు అరెస్ట్​ చేస్తలే? 

‘‘ఫోన్ ట్యాపింగ్ కేసును కేంద్రానికి అప్పగించాలని కోరుతున్న కిషన్ రెడ్డి.. తెలంగాణలో పలు స్కామ్​లపై ఈడీ నమోదు చేసిన కేసులు ఎక్కడి వరకు వచ్చినయో చెప్పాలి?  గొర్రెల స్కీం,  ఫార్ములా రేసు సహా ఇతర కేసులన్నింటినీ ఈడీ దర్యాప్తు చేస్తున్నది.  కేసులకు సంబంధించి అన్ని వివరాలను కేంద్ర దర్యాప్తు సంస్థలు తీసుకున్నాయి. అయినా.. ఇప్పటికీ కేటీఆర్​ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పటికే బీఆర్ఎస్ అవయవదానం చేసి.. లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు ఇచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కేసులతో లాభం వస్తదనే స్వార్థం బీజేపీలో ఉంది’’ అని సీఎం రేవంత్ ​రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రం ప్రభుత్వం అనవసర హడావిడి చేయదని, సంస్థలు వాటి విధానంతో విచారణ చేపడతాయని ఆయన అన్నారు. కాళేశ్వరం ఇంజనీర్ల అక్రమ సంపాదన ఏంటనేది ఏసీబీ దాడులతో ప్రజలకు అర్థమవుతున్నదని తెలిపారు.  

తుమ్మిడిహెట్టి కోసం త్వరలో మహారాష్ట్రకు

ఢిల్లీ దేశానికి పరిపాలనా కేంద్రమని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘ఢిల్లీ రావడం, పోవడం, సంబంధిత శాఖల మంత్రులను కలిసి రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవడం మా ప్రాథమిక బాధ్యత. అంతే తప్ప నేను ఢిల్లీ చూడంది కాదు, తెలియంది కాదు’’ అని ఆయన పేర్కొన్నారు. పరిపాలన అంటూ హైదరాబాద్ లోనే కూర్చునే సీఎం తాను కాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ రాజధాని ఢిల్లీతోపాటు కర్నాటక, ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్తానని చెప్పారు. త్వరలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ కోసం మహారాష్ట్రలో  పర్యటిస్తానన్నారు. మొన్నటి ఉగ్రదాడి ఘటనకు ముందు వరకు ఇండియా –పాకిస్తాన్  కూడా నీళ్లను  ఇచ్చిపుచ్చుకున్నాయని.. శత్రు దేశమైన పాక్ స్తాన్ తో నీటిపై చర్చలు జరిపినప్పుడు, తోటి తెలుగు రాష్ట్ర సీఎంతో సమస్యల పరిష్కారంపై చర్చిస్తే తప్పా అని ఆయన ప్రశ్నించారు. 2016 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో 299 టీఎంసీల కృష్ణా జలాలకు, 2023 లో కేంద్రానికి రాసిన లేఖలో 400 టీంఎసీలకు  హరీశ్​ రావు ఒప్పుకున్నారని తెలిపారు. వాళ్లకన్నా తాము 100 టీఎంసీలు ఎక్కువగా 500 టీఎంసీలు డిమాండ్ చేస్తే తప్పుబడుతున్నారని, ఈ విషయంలో అసలు హరీశ్​ రావుకు మైండ్  పనిచేస్తలేదని దుయ్యబట్టారు.  

కిషన్ ​రెడ్డి లేఖలతో కాదు..అజెండాతో పిలిస్తే వస్తం..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలు రాయడం కాదని, రాష్ట్ర అభివృద్ధి అంశాలపై అజెండా పెట్టుకొని పిలిస్తే స్వయంగా తానే వస్తానని సీఎం రేవంత్ అన్నారు. ‘‘అజెండా పెట్టుకొని పిలిస్తే.. మంత్రులు, అధికారులను పంపిస్తం. అవసరమైతే నేను, డిప్యూటీ సీఎం కూడా వస్తం. ఇది ఫెడరల్ సిస్టం అని మేం ముందునుంది చెప్తు న్నం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి’’ అని స్పష్టత ఇచ్చారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయని, ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్, ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీ, ఆర్ఎస్ఎస్ స్థాపించిన మహారాష్ట్రలోనూ ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు. తొలుత ఈ మూడు రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు తొలగించాక తెలంగాణలో రిజర్వేషన్లపై మాట్లాడాలని కిషన్ రెడ్డికి సీఎం రేవంత్​రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

లోకేశ్​తో కేటీఆర్ భేటీ వెనుక మతలబేంది?

‘‘నేను  ఏపీ సీఎంతో అధికారికంగా చర్చలో పాల్గొంటే తప్పుబడుతున్న కేటీఆర్.. అసలు ఆ రాష్ట్ర మంత్రి లోకేశ్​తో ఆయన చీకటి భేటీ ఎందుకు చేపట్టినట్లు?” అని సీఎం రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ లో మూడు సార్లు లోకేశ్​తో కేటీఆర్ భేటీ అయిన విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. ‘‘అసలు లోకేశ్​తో కేటీఆర్​ ఎందుకు భేటీ అయ్యారు? ఈ విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఒక మంత్రితో భేటీ అవుతున్న విషయం కండ్ల ముందు వ్యక్తులే చెప్తుంటరు” అని పేర్కొన్నారు. 

ఎవరికీ భయపడ.. నా ప్రయారిటీ రాష్ట్రం

‘‘ఎవరికైనా భయపడితే నేను రేవంత్ రెడ్డిని కాదు.  సిస్టమ్​కు మాత్రమే భయపడే వ్యక్తిని. నా ప్రయారిటీ రాష్ట్రం. సమస్య ఉంటే చర్చలతో పరిష్కరించు కుంటాం. కొట్లాట నా చివరి అస్త్రం. ఇదే ధోరణిలో కేంద్రం, పక్క రాష్ట్రం ఏపీతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నం. కొట్లాడుకుంటూ పోతే.. పాలకులకు కాదు, ప్రజలకు నష్టం’’ అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్​లో ఉన్న అనేక అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ఎలివేటర్ కారిడార్​ కోసం విలువైన డిఫెన్స్ భూముల్ని రక్షణ శాఖ బదలాయించిందన్నారు. కేసీఆర్ ఫెడరల్ సిస్టంలో భాగంగా కేంద్రంతో సఖ్యతగా ఉండి ఉంటే.. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టులతోపాటు  రైల్వే ప్రాజెక్టులు, మెట్రో విస్తరణకు కేంద్రం ఏనాడో ఆమోదం తెలిపేదని ఆయన అన్నారు.  

కేసీఆర్ ఫ్యామిలీలోనే ఏకాభిప్రాయం లేదు

కేసీఆర్ ఫ్యామిలీలోనే ఏకాభిప్రాయం లేదని సీఎం రేవంత్​ విమర్శించారు. ‘‘ఆ కుటుంబంలో సూసైడ్ అండ్ టెండెన్సీ వస్తది. ఏదో ఒక రోజు ఆ వార్త కూడా చూడాల్సి వస్తదేమో. కేటీఆర్ నాయకత్వాన్ని కవితే ఒప్పుకోవడం లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్​ రావు, కవిత తీసేసిన తహసీల్దార్లు. వాళ్లకు ఇంట్లోనే విలువలేదు. ఇక ప్రజలకు ఏం చేప్తరు? అన్నా, చెల్లెళ్ల మధ్య అధికారం, ఆస్తుల పంచాయితీ ఉంది. పెద్ద రందిలో ఆ కుటుంబ పెద్ద ఉన్నరు. రెండు రాష్ట్రా ల మధ్య వివాదాలు పెంచింతే రాజకీయంగా బతుకుతామనుకుంటున్నరేమో!” అని వ్యాఖ్యా నించారు. ఎమ్మెల్యే మరణంతో వచ్చే బై ఎలక్షన్​లో అభ్యర్థిని నిలపొద్దన్న సంప్రదాయాన్ని పీజేఆర్ మరణంతో వచ్చిన ఎన్నికల్లో తుంగలో తొక్కిందే కేసీఆర్ అని సీఎం మండిపడ్డారు.  

కేదార్​ ఆత్మహత్య రిపోర్ట్​ తెప్పించినం

కేటీఆర్​ది ఒక గంజాయి బ్యాచ్ అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘‘ఆ గంజాయి బ్యాచ్ సవాల్ విసిరితే నేను స్పందించాలా? ఒకవేళ సవాల్ స్వీకరించి పోతే.. బాత్రూం కడగడంపై చర్చ మొదలు పెడితే ఎట్లా?” అని వ్యాఖ్యానించారు. కేటీఆర్​ది తెలుగు సినిమాలోని ‘పాకీజా’ క్యారెక్టర్ అని ఎద్దేవా చేశారు. ‘‘బయటకు లెక్చరర్​గా, లోపల పాకీజాగా ఉంటుంది కేటీఆర్​ పరిస్థితి. ఆయన బిజినెస్ భాగస్వామి కేదార్  దుబాయ్​లో ఆత్మహత్య చేసుకున్నడు. ఆయన ఫోరెన్సిక్ రిపోర్ట్​ను తెప్పించినం. త్వరలో బయటపెడ్తం. ఇక కేటీఆర్​ బామ్మర్ది ఫామ్​హౌస్​లో గంజాయి, డ్రగ్స్​తో దొరికిండు. ఇలా కేటీఆర్ చుట్టు పక్కల ఉన్న వాళ్లంతా గంజాయి బ్యాచ్​నే. టెస్ట్​ల కోసం రక్తం, జుట్టు ఇస్తా అని సవాల్ విసిరిన కేటీఆర్ మాట మార్చి కోర్టుకు పోయి ఆర్డర్స్‌‌ తెచ్చుకున్నడు’’ అని ఆయన విమర్శించారు.

ప్రధాన ప్రతిపక్ష నేత వస్తే చర్చకు సిద్ధం

తనకు ఎవరితో వివాదం లేదని, కేవలం రాజకీయ ప్రత్యర్థులే ఉన్నారని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. ‘‘కేసీఆర్ నా రాజకీయ ప్రత్యర్థి. ఆయన ప్రతిపక్ష నేతగా చేయాల్సింది కూడా చేయడం లేదు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ వస్తే..  ఏ అంశంపైన చర్చకైనా సిద్ధం. అసెంబ్లీకి కేసీఆర్​ వస్తే.. ఆయన మర్యాదకు, గౌరవానికి ఎలాంటి భంగం కలగనివ్వను. ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పులను ఎత్తి చూపొచ్చు. సూచనలను, సలహాలు కూడా తీసుకుంటాం” అని అన్నారు. కేటీఆర్ లాంటి వాళ్ల సవాళ్లకు ఆ స్థాయి వారినే పంపిస్తానని వ్యాఖ్యానించారు. కాళేశ్వ రం కేసులో కేసీఆర్, హరీశ్​ రావు పై ఎంక్వైరీ జరుగుతున్నదన్నారు. మాజీ అధికా రి శివ బాలకృష్ణ అరెస్ట్​ అయిన హెచ్​ఎండీఏ అక్రమ అనుమతుల కేసు కూడా విచారణలో ఉందన్నారు. అటు ఫార్ములా ఈ కార్​రేస్​​ కేసులో కేటీఆర్, పవర్ కొనుగోళ్ల కేసులో జగదీశ్​ రెడ్డిపైనా ఎంక్వైరీ జరుగుతున్నదని వివరించారు.