సీఎం కృషి వల్లే మియాపూర్ భూముల విజయం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి 

సీఎం కృషి వల్లే మియాపూర్ భూముల విజయం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి 

ఖమ్మం రూరల్, వెలుగు: హైదరాబాద్ మియాపూర్ లోని సర్వే నంబర్ 100, 101లలో ఉన్న 550 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం పట్ల రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ భూములు దక్కడంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి కృషి ఎంతో ఉందన్నారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.

ఆరో వార్డు సింగరేణి కాలనీలో రూ.4.96 కోట్లతో అంతర్గత సీసీ రోడ్లు, 8వ వార్డులోని కోట నారాయణపురం నుంచి కోదాడ రోడ్డును కలుపుతూ నిర్మించే ఆర్ అండ్ బీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 176 మంది లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు.

అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావుకు, బెంజ్ కారును గిఫ్ట్ ఇచ్చిన మరో రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఈ భూములు కట్టబెట్ట జూశారని ఆరోపించారు. రేవంత్​రెడ్డి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పటి నుంచే భూములను కాపాడేందుకు  పోరాటం చేశారని, సీఎం అయ్యాక సుప్రీంకోర్టులో దావా వేసి ప్రభుత్వం తరఫున న్యాయవాదులను నియమించారని చెప్పారు.