హైదరాబాద్ సిటీ మునగొద్దంటే హైడ్రా ఉండాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ సిటీ మునగొద్దంటే హైడ్రా ఉండాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం మునగొద్దంటే హైడ్రా ఉండాల్సిదేనని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, నాలాల అక్రమణలను హైడ్రా అడ్డుకుంటుందన్నారు. ఇప్పటి వరకు 13 పార్కులు, 20  చెరువులను కబ్జాల నుంచి హైడ్రా బయటపడేసిందని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు హైడ్రాను అస్రంగా వాడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సిటీలో ఎంత భారీ వర్షం పడినా గంటా, రెండు గంటల వ్యవధిలోనే ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించి.. వరద నీటిని మళ్లించడంలో హైడ్రా బాగా పని చేస్తోందన్నారు. హైడ్రా అవసరాన్ని హైదరాబాద్ గుర్తిస్తోందన్నారు. పేదలు మురికి కూపంలో జీవితాలు వెల్లదీయాలని సంకుచితంగా ఆలోచించే వాళ్లే హైడ్రాను వ్యతిరేకిస్తూ దానిని ఒక బూచిగా చూపిస్తూ పేదల్లో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి.

దేశంలోని ప్రధాన మెట్రోపాలిటిన్ నగరాల్లో ఉన్న ఇబ్బందులు హైదరాబాద్ సిటీలో లేవన్నారు. హైదరాబాద్ తెలంగాణకు బలమని.. రాష్ట్ర రాజధానిలో సగర్వంగా మిస్ వరల్డ్ కాంపిటిషన్  నిర్వహించుకున్నామని గుర్తు చేశారు. ప్రపంచ నగరాలతో పోటీ పడేలా హైదరాబాద్‎ను మరింత తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.  వరదలతో ఇబ్బందులు పడుతోన్న హైదరాబాద్ నగరానికి శాశ్వత పరిష్కారం కల్పిస్తామన్నారు. 79 భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం (ఆగస్ట్ 15) గోల్కొండ కోటలో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. 

అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. ఎందరో త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవమని  అన్నారు. భారత తొలి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ దేశాన్ని ఉన్నతంగా నిలిపారన్నారు. మనం చూస్తోన్న ఆధునిక భారత ఐదేళ్లు, పదేళ్లలో సాధించింది కాదని అన్నారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రజాసేవను కొనసాగిస్తోందని.. తక్కువ కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చామని తెలిపారు.

పదేళ్లు కళ్లకు ఒత్తులు పెట్టుకుని ఎదురు చూసిన ప్రజలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని.. అలాగే ప్రజా ప్రభుత్వం రైతుల్ని రుణవిముక్తుల్ని చేసిందని చెప్పారు. రైతు పండించిన చివరి గింజ వరకు సేకరిస్తున్నామని.. సన్న వడ్లకు రూ.500 బోనస్ 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో వేశామని గుర్తు చేశారు. అత్యధిక ధాన్యం పండించే రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందన్నారు . బీసీలకు 42 శాతం కోటా బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని తెలిపారు.