మహబూబ్ నగర్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే రైతులకు రూ.2 లక్షల పంట రుణమాఫీ చేశాం.. దేశంలో గతంలో ఏ ప్రభుత్వం ఈ విధంగా చేయలేదు. దీనిపై ప్రధాని మోడీ, మాజీ సీఎం కేసీఆర్ చర్చకు సిద్ధమా..? అని సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. రుణమాఫీపై బీఆర్ఎస్, బీజేపీ కలిసి వచ్చినా.. విడిగా వచ్చిన చర్చకు సిద్ధమని ప్రకటించారు. ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు మహబూబ్ నగర్లో ప్రభుత్వం రైతు పండగ కార్యక్రమం నిర్వహించింది.
ఇందులో భాగంగా శనివారం (శనివారం 30) రైతు పండగ ముగింపు వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్ఆర్ఆర్ అమ్మి రుణమాఫీ చేసిందని.. బీఆర్ఎస్ రూ.11 వేల కోట్లు రుణమాఫీ చేస్తే.. అందులో రూ.8 వేల కోట్లు మిత్తిలకే పోయాయని విమర్శించారు.
25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని.. వివిధ కారణాల వల్ల పంట రుణమాఫీ కానీ రైతులకు తాజాగా నిధులు విడుదల చేశామని చెప్పారు. రుణమాఫీ, ఉచిత కరెంట్, రైతు బీమా, మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని అన్నారు. ఒక రైతు బిడ్డగా రైతుల కష్టాలు ఏమిటో తనకు తెలుసన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ప్రజలకు బాగా తెలుసని ఎద్దేవా చేశారు. రైతులు సంతోషంగా ఉంటే ప్రజలకు నిద్ర పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.