
న్యూఢిల్లీ: ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ బీసీ కాదని.. ఆయన కన్వర్టెడ్ ఓబీసీ అని హాట్ కామెంట్స్ చేశారు. కన్వర్టెడ్ అయిన మోడీ బీసీల కోసం ఏం చేయరని విమర్శించారు. బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ కుల గణనకు వ్యతిరేకమని ఆరోపించారు. తెలంగాణలో నిర్వహించిన కుల గణన సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీలోని ఇందిరా భవన్లో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు గురువారం (జూలై 24) పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఎంపీలు, తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్రలో కుల గణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని.. ఆయన మాట ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణన సర్వే విజయవంతంగా నిర్వహించామన్నారు. రాహుల్ గాంధీ మాటే తమకు లక్ష్మణ రేఖ అని స్పష్టం చేశారు. దేశానికి ఒక దిశను చూపించేలా కుల గణన సర్వే చేశామని.. తద్వారా కుల గణనపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చామన్నారు.
మొదటి నుంచి క్యాస్ట్ సెన్సస్‌కు వ్యతిరేకంగా ఉన్న బీజేపీని తెలంగాణలో విజయవంతంగా కుల గణన పూర్తి చచేసి మన దారిలోకి తీసుకొచ్చామని చెప్పారు. చివరకు జనగణనలో కుల గణన చేసేలా ప్రధాని మోడీ అంగీకరించక తప్పని పరిస్థితి తెచ్చామన్నారు. మొత్తానికి మోడీని రాహుల్ గాంధీ రూట్లోకి తీసుకురాగలిగామని.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త జనగణనలో కుల గణన చేయాలని నిర్ణయించడం రాహుల్ గాంధీ సక్సెస్ అని అన్నారు. తెలంగాణ మోడల్ ను వివిధ రాష్ట్రాల్లో ఎంపీలు చెప్పాలనదే మా ఆలోచన అని.. అందుకోసమే ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్ అన్నారు. కులగణన కేవలం సర్వేనే కాదని.. ఇది సొసైటి మెగా హెల్త్ చెకప్ అని అభివర్ణించారు.
మీరే ఒప్పించాలి:
కుల గణన సర్వే ఆధారంగా తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించామని.. ఇందుకు ఉద్దేశించిన మూడు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ బిల్లుల ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని మీరే ఒప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్లో మీరు కొట్లాడండి.. బయట జంతర్ మంతర్ దగ్గర మేం కొట్లాడుతామన్నారు. కులగణనపై సోనియా గాంధీ ఇచ్చిన లేఖ నాకు సర్వస్వమని అన్నారు. కుల గణన సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వివరాలు ఇవ్వలేదని.. వారి ముగ్గురిని తెలంగాణ జనభా నుంచి తీసేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.