
న్యూఢిల్లీ: తెలంగాణలో కులగణన సర్వే చారిత్రాత్మకమని.. ఈ సర్వే దేశానికి ఆదర్శంగా నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో నిర్వహించిన కుల గణన సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీలోని ఇందిరా భవన్లో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు గురువారం (జూలై 24) పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఎంపీలు, తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు.
ALSO READ | తెలంగాణ కులగణన సక్సెస్.. ఈ సర్వే దేశానికే ఆదర్శం: మల్లికార్జున ఖర్గే
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే కుల గణన నిర్వహిస్తామని ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని.. ఆయన ఇచ్చిన మాట ప్రకారం పవర్లోకి రాగానే కులగణన చేశామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో డోర్ టు డోర్ తిరిగి జనాభాను లెక్కించామని తెలిపారు. దాదాపు రెండు లక్షల మంది సిబ్బందితో 50 రోజుల్లో కులగణన సర్వే విజయవంతంగా నిర్వహించి.. ఎవరి జనాభా ఎంతో తేల్చామని చెప్పారు. పకడ్బందీగా సర్వే చేయించి డిజిటలైజ్ చేశామన్నారు. డేటా ఎంట్రీని ఎన్యుమరేటరే దగ్గరుండి చేయించారని.. ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడ్డామన్నారు.
అనంతరం కుల గణన నివేదికను అసెంబ్లీలో చర్చించి ఆమోదం తెలిపామన్నారు. ఈ సర్వే ప్రకారం ఓబీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ఉద్దేశించిన రెండు బిల్లులకు అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కల్పించాలని ఉద్దేశించిన ఆర్డినెన్స్‌ను ఇప్పటికే గవర్నర్‌కు పంపించామని చెప్పారు. విస్తృత సంప్రదింపులతో క్యాస్ట్ సర్వే పూర్తి చేయగలిగామన్నారు భట్టి.