
న్యూఢిల్లీ: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వే సక్సెస్ అయ్యిందని.. ఈ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. తెలంగాణలో నిర్వహించిన కుల గణన సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీలోని ఇందిరా భవన్లో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు గురువారం (జూలై 24) పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఎంపీలు, తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు.
ALSO READ |మోడీ బీసీ కాదు కన్వర్టెడ్ ఓబీసీ.. ఆయన బీసీలకు ఏం చేయరు: సీఎం రేవంత్
ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. కుల గణన సర్వే ద్వారా తెలంగాణ ఎక్స్ రే తేలిందని.. ఇక ఎవరెంతో వారికంత దక్కాలని అన్నారు. విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో ఎవరి వాటాలు వారికి దక్కాలని.. ఇందుకు దేశమంతా డేటా బేస్ సర్వే జరగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ వర్గానికి అన్యాయం జరగొద్దన్నదే కాంగ్రెస్ విధానమని స్పష్టం చేశారు. తెలంగాణ సామాజిక న్యాయం దిశగా వెళ్తోందన్నారు. బీసీల్లో ముస్లింలను చేర్చితే రిజర్వేషన్ 60 శాతం దాటిందని తెలిపారు. ఇంగ్లీష్ విద్య ఇప్పుడు దేశానికి చాలా అవసరమని.. ఆంగ్ల విద్యతో ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నారు.