టికెట్‌‌‌‌ రేట్లు పెంచాలంటే కార్మికులకు 20 శాతం వాటా ఇవ్వాలి:సీఎం రేవంత్

టికెట్‌‌‌‌ రేట్లు పెంచాలంటే కార్మికులకు 20 శాతం వాటా ఇవ్వాలి:సీఎం రేవంత్
  • కార్మికుల పిల్లల కోసం కార్పొరేట్‌‌‌‌ స్థాయిలో ఇంటర్ వరకు ఉచిత విద్య
  • కార్మికుల భవన్‌‌‌‌ నిర్మాణానికి స్థలం, కార్మికులకూ ఇండ్ల స్థలాలు
  • ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌ సిటీలో సకల వసతులు కల్పిస్తం.. రాజీవ్ ఆరోగ్యశ్రీతోపాటు 
  • ఉచిత వైద్యం అందిస్తం  నవంబర్‌‌‌‌‌‌‌‌ చివరలో సంఘాల 
  • లీడర్లతో మీటింగ్​ పెడ్తం.. డిసెంబర్ 9న పూర్తి వివరాలు వెల్లడిస్తం
  • ఐటీ, ఫార్మా లెక్క సినీ ఇండస్ట్రీ కూడా ఎదగాలి.. ప్రపంచ సినీ పరిశ్రమకు హైదరాబాద్​ వేదిక కావాలని పిలుపు
  • సినీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌‌‌‌కు అభినందన సభ

హైదరాబాద్​, వెలుగు:సినీ కార్మికుల సంక్షేమం కోసం నిధి ఏర్పాటు చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ వెల్ఫేర్ ఫండ్‌‌‌‌కు రూ.10 కోట్లు అందిస్తామని సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఎంత పెద్దవారైనా అదనంగా సినిమా టికెట్ల ధరలు  పెంచాలనుకుంటే లాభంలో 20 శాతం కార్మికుల వెల్ఫేర్ ఫండ్‌‌‌‌కు ఇవ్వాలని, అలా అయితేనే పెంపునకు అనుమతి ఇచ్చేలా జీవో జారీ చేస్తామని స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న, మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి ఈ నిధిని ఉపయోగించాలని సూచించారు. 

మంగళవారం హైదరాబాద్​ యూసఫ్‌‌‌‌గూడలో సినీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ కార్మికుల శ్రమను గుర్తించి, వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని, ఈ విషయంలో ఏ  నిర్మాతల ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని అన్నారు. ‘‘సినిమా టికెట్ల ధరలు పెంచాలని నిర్మాతలు అడిగినప్పుడు, పెంచిన రేట్ల ద్వారా వచ్చే లాభంలో కార్మికులకు వాటా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిబంధన విధిస్తాం. హీరోలకు, నిర్మాతలకు ఆదాయం వస్తున్నా కార్మికులకు అదనంగా ఒక్క రూపాయి కూడా రావడం లేదు.  ఈ వేదికపై నుంచి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నాం. ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచుతూ జీవో జారీ చేయాలంటే, ఆ అదనపు ఆదాయంలో 20 శాతం తప్పనిసరిగా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద నగదు బదిలీ జరగాలి. ఈ ఒప్పందం ప్రకారమే జీవో ఇస్తాం. ఆ మేరకు నిబంధనలు సవరిస్తాం” అని ప్రకటించారు.  సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి ప్రణాళికతో ముందుకు వస్తున్నదని చెప్పారు.


‘‘నవంబర్‌‌‌‌ చివరిలో కార్మిక సంఘాల నాయకులతో సమావేశమవుతాం. డిసెంబర్‌‌‌‌ 9న జరిగే తెలంగాణ ప్రభుత్వ రెండో వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వం చేయబోయే చర్యలను స్పష్టంగా ప్రకటిస్తాం” అని సీఎం రేవంత్​ వెల్లడించారు. మహాభారతంలో కర్ణుడు మిత్రధర్మం కోసం ప్రాణాలు ఇచ్చాడని, అలాగే, తాను సైతం మిత్రధర్మాన్ని నిలబెడతానని రేవంత్​ పేర్కొన్నారు. 

కార్మికుల పిల్లల కోసం కార్పొరేట్‌‌‌‌ స్థాయిలో స్కూల్..

కార్మికుల పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి భరోసా ఇచ్చారు. అందుకోసం కృష్ణానగర్ ప్రాంతంలో 3- నుంచి 4 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి, కార్పొరేట్ స్థాయిలో పాఠశాలను నిర్మిస్తామని తెలిపారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. పాఠశాలలో పిల్లలకు ప్రతిరోజూ నాణ్యమైన బ్రేక్‌‌‌‌ఫాస్ట్, పాలు, మధ్యాహ్న భోజనం కూడా ఉచితంగా అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.  సినీ కార్మికుల ఇండ్ల సమస్య పరిష్కారం కోసం త్వరలో 24  క్రాఫ్ట్స్ అసోసియేషన్ నాయకులతో మాట్లాడి, సహాయం అందిస్తామని తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్ట్ దగ్గర నిర్మించబోయే భారత్ ఫ్యూచర్ సిటీలో కూడా కార్మికులకు అన్ని వసతులను కల్పిస్తామని చెప్పారు.  

హైదరాబాద్​ వైపు చూస్తున్న హాలీవుడ్‌‌‌‌

సినీ కార్మికుల కష్టాలు, త్యాగం వల్లే తెలుగు సినిమా ఆస్కార్‌‌‌‌ స్థాయికి చేరిందని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి అభినందించారు. “సినీ కార్మికుల కష్టమే తెలుగు సినిమాకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు హాలీవుడ్‌‌‌‌ కూడా హైదరాబాద్‌‌‌‌ వైపు చూస్తున్నది” అని పేర్కొన్నారు.  సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, ఫార్మా రంగాలకు ఉన్నంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకుందని సీఎం చెప్పారు.  హాలీవుడ్‌‌‌‌ కూడా హైదరాబాద్‌‌‌‌కు వచ్చి షూటింగ్‌‌‌‌లు చేసే స్థాయికి తెలుగు ఫిల్మ్‌‌‌‌ ఇండస్ట్రీని తీసుకెళ్లడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌‌‌‌లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రత్యేక చాప్టర్‌‌‌‌‌‌‌‌ కేటాయిస్తామన్నారు.   ‘‘నేను ముఖ్యమంత్రిగా కాదు, మీ కుటుంబ సభ్యుడిగా ఇక్కడికి వచ్చాను. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నా మీద ఉంది. మీకు ఎప్పుడు అవసరం ఉన్నా.. మీ సోదరుడు రేవంత్‌‌‌‌ రెడ్డి మీకు అండగా ఉంటాడు” అని  తెలిపారు. మణికొండలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి  తన సొంతంగా 10 ఎకరాల భూమిని కార్మికులకు దానం చేశారని చెప్పారు. అనంతరం  చిత్రపురి కాలనీ కోసం కోట్ల విజయభాస్కర్ రెడ్డి 67 ఎకరాలు కేటాయించారని తెలిపారు. ఆ పెద్దల కృషితోనే తెలుగు సినీ పరిశ్రమ నేడు ప్రపంచస్థాయిలో వెలుగొందుతున్నదని అన్నారు. అలాగే, రామానాయుడు, పద్మాలయ, అన్నపూర్ణ స్టూడియోల ఏర్పాటుకు ప్రభుత్వం తక్కువ ధరలకు భూములు ఇచ్చిందని, ఆ ప్రోత్సాహంతో తెలుగు సినిమా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.  

కార్మికులందరికీ హెల్త్, లైఫ్​ ఇన్సూరెన్స్​..

సినీ కార్మికుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టిపెడ్తామని,  వారికి రాజీవ్ ఆరోగ్యశ్రీతోపాటు ఉచిత వైద్యం అందేలా చూస్తామని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి చెప్పారు.  హెల్త్, లైఫ్​ ఇన్సూరెన్స్‌‌‌‌ కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.  రాష్ట్రం వచ్చిన తర్వాత ఆగిపోయిన నంది అవార్డుల స్థానంలో పోరాట యోధుడు గద్దర్ పేరు మీద ‘గద్దర్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్’ నిర్వహించి కళాకారులను సన్మానిస్తున్నామని తెలిపారు. ‘‘సినీ కార్మికుల సంఘానికి ప్రత్యేక భవన్‌‌‌‌ లేదు అని తెలుసుకున్నా. దానికి కావాల్సిన స్థలం కేటాయించి, భవన్‌‌‌‌ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తాం” అని తెలిపారు. ఫైటర్స్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌ కోసం కూడా ప్రత్యేక స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.


సినీ కార్మికుల కష్టమే తెలుగు సినిమాకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు హాలీవుడ్‌‌‌‌ కూడా హైదరాబాద్‌‌‌‌ వైపు చూస్తున్నది.
నేను ముఖ్యమంత్రిగా కాదు, మీ కుటుంబ సభ్యుడిగా ఇక్కడికి వచ్చాను. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నా మీద ఉంది. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా.. 
మీ సోదరుడు రేవంత్‌‌‌‌ రెడ్డి మీకు అండగా ఉంటాడు.
– సీఎం రేవంత్​ రెడ్డి