నేడు కేంద్ర మంత్రి గడ్కరీతో రేవంత్ భేటీ.. ట్రిపుల్ ఆర్ సౌత్‌‌కు సంబంధించిన అనుమతులపై చర్చ

నేడు కేంద్ర మంత్రి గడ్కరీతో రేవంత్ భేటీ.. ట్రిపుల్ ఆర్ సౌత్‌‌కు సంబంధించిన అనుమతులపై చర్చ
  • సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న రేవంత్.. 2 రోజుల పర్యటన

న్యూఢిల్లీ, వెలుగు: రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్‌‌రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రాభివృద్ధి, మౌళిక వసతుల కల్పన, హైవేల మంజూరు, వరద సాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఆర్థిక సాయంపై  విజ్ఞప్తులు అందజేయనున్నారు.  సోమవారం సీఎం రేవంత్‌‌రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాత్రి 8:40 గంటలకు అక్కడికి చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా తుగ్లక్ రోడ్‌‌లోని అధికారిక నివాసానికి చేరుకొని బస చేశారు. మంగళవారం ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ నేపథ్యంలో ఢిల్లీ నుంచి సమీక్షించనున్నారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలతో ఉదయం బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఈ భేటీలో ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో   రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్​ఆర్​) దక్షిణ భాగానికి సంబంధించిన అనుమతులపై చర్చించనున్నారు. అలాగే, హైదరాబాద్ – అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం మరోసారి అభ్యర్థించనున్నారు. అలాగే, రాష్ట్రంలో పలు హైవే ప్రాజెక్టులు, డ్రైపోర్టులపై విజ్ఞప్తులను అందజేయనున్నారు. పార్టీ హైకమాండ్ ముఖ్యనేతలు, ఇతర మీటింగ్స్‌‌లలోనూ సీఎం పాల్గొనే అవకాశం ఉంది.

రేపు రక్షణ, హోం, ఆర్థిక శాఖ మంత్రులతో..
భారీ వర్షాల వల్ల జరిగిన వరద నష్టం, తాజా పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి  తీసుకెళ్లనున్నారు. కేంద్ర విపత్తు నిర్వహణ, హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది.  రాష్ట్రంలో వరద విపత్తు పరిస్థితులను అమిత్​షాకు రేవంత్​రెడ్డి వివరించనున్నారు. ముఖ్యంగా కామారెడ్డి, ఖమ్మం, ఇతర ప్రాంతాల్లో నెలకొన్న వరద నష్టంపై ప్రాథమిక రిపోర్ట్‌‌ను అందజేయనున్నట్లు తెలిసింది. ఇందుకు తగ్గట్టుగా కేంద్రం నుంచి ఆర్థిక సహకారం కోరనున్నారు. అలాగే, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్‌‌ను కలిసి హైదరాబాద్‌‌లోని మౌలిక వసతుల రూపకల్పనలో భాగంగా కావాల్సిన డిఫెన్స్ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరనున్నారు.

దీంతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌‌తోనూ సీఎం భేటీ కానున్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి.  ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌‌కు ఆర్థిక సహకారం అందించాలని ఆమెను కోరనున్నారు. అలాగే, గత ప్రభుత్వం అధిక వడ్డీ రేట్లకు తెచ్చిన అప్పులకు సంబంధించి లోన్ రీస్ట్రక్చర్ చేయాలని కోరే అవకాశం ఉన్నది.  కేంద్రం నుంచి వివిధ స్కీమ్‌‌లు, సంక్షేమ పథకాలకు రావాల్సిన పెండింగ్ బకాయిలు త్వరితగతిన విడుదల చేయాలని విన్నవించనున్నారు.