
హైదరాబాద్, వెలుగు: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. అల్వాల్ లోని పంచశీల కాలనీలో గల నివాసంలో ఎమ్మెల్యే భార్య రూపాదేవి రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ శనివారం కొంపల్లిలోని ఎమ్మెల్యే సత్యం నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు. అనంతరం ఎక్స్ వేదికగా.. "భార్యావియోగంతో దుఃఖంలో ఉన్న సోదరుడు, శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం, ఆయన కుటుంబ సభ్యులను కొంపల్లిలోని ఆయన నివాసంలో పరామర్శించాను. సత్యం భార్య రుపాదేవి అకాల మరణం చెందడం బాధాకరం. వారి ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" అని ట్వీట్ చేశారు.