కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తం : సీఎం రేవంత్

కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తం : సీఎం రేవంత్
  • విద్యుత్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ హెచ్చరిక

హైదరాబాద్‌‌, వెలుగు: కారణం లేకుండా కరెంట్ కట్ చేస్తే, అందుకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కరెంట్ కోతలు విధించాలని తాము చెప్పలేదని, అయినా ఎందుకు కోతలు విధిస్తున్నారని ప్రశ్నించారు. గురువారం సెక్రటేరియెట్ లో విద్యుత్‌‌ శాఖ అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇటీవల పలుచోట్ల విద్యుత్తు సరఫరా నిలిపివేసిన సంఘటనలను ప్రస్తావించి, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవ‌‌ల మూడు సబ్ స్టేషన్ల ప‌‌రిధిలో విద్యుత్ స‌‌ర‌‌ఫ‌‌రాకు అంత‌‌రాయం క‌‌లిగినట్టు తన దృష్టికి వచ్చిందనీ, దానికి కార‌‌ణం ఏంటని అధికారులను సీఎం ప్రశ్నించారు.

సబ్ స్టేషన్లలో లోడ్ హెచ్చుతగ్గులను డీఈలు స‌‌రిచూసుకోవాలని, అలా చూసుకోక‌‌పోవ‌‌డంతోనే స‌‌మ‌‌స్య త‌‌లెత్తింద‌‌ని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ..  ‘‘గ‌‌త ప్రభుత్వ హ‌‌యాంలో నియ‌‌మితులైన కొంద‌‌రు అత్యుత్సాహంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ఉద్దేశపూర్వకంగా కోత‌‌లు పెడుతున్నారు. అలాంటి వాళ్లపై కఠిన చర్యలు తప్పవు. గ‌‌తంతో పోలిస్తే విద్యుత్ స‌‌ర‌‌ఫ‌‌రా పెంచినం.

అయినప్పటికీ కోత‌‌లు పెడుతున్నారంటూ దుష్ప్రచారం జరుగుతున్నది. దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులపైనే ఉన్నది. ఎక్కడైనా 5 నిమిషాల‌‌కు మించి విద్యుత్ స‌‌ర‌‌ఫ‌‌రా నిలిచిపోతే, అందుకు గ‌‌ల కార‌‌ణాల‌‌పై వెంట‌‌నే స‌‌మీక్షించుకోవాలి. ఏవైనా మ‌‌ర‌‌మ్మతులతో స‌‌ర‌‌ఫ‌‌రా నిలిపివేయాల్సి వ‌‌స్తే ముందుగానే స‌‌మాచారం ఇవ్వాలి’’ అని సూచించారు.