ఢిల్లీకి సీఎం రేవంత్.. బీసీ రిజర్వేషన్లపై న్యాయనిపుణులతో చర్చ

 ఢిల్లీకి సీఎం రేవంత్.. బీసీ రిజర్వేషన్లపై న్యాయనిపుణులతో చర్చ

వెనుకబడిన వర్గాల వారికి 42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తమిళనాడు  ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసులో ఇంప్లీడ్ కానుందని సమాచారం. రాష్ట్రపతి గవర్నర్ కు పంపిన బిల్లుల ఆమోదంపై  రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ సారథ్యంలోని బదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఆరు నెలల క్రితం బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. దానిని గవర్నర్ కు పంపగా.. ఆయన కేంద్ర హోంశాఖ ద్వారా రాష్ట్రపతికి పంపారు. తమిళనాడు, కేరళ కేసుల్లో తెలంగాణ కూడా ఇంప్లీడ్ కావాలని బా విస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టుద్వారా కేంద్రపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించనుంది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ బయల్దేరి వెళ్లినట్టు సమాచారం. అక్కడ న్యాయ నిపుణులతో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

ఢిల్లీకి మంత్రి వర్గ ఉపసంఘం

బీసీ రిజర్వేషన్ల కోసం ఎంపిక చేసిన మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులు మల్లు భట్టి విక్రమార్క. ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఈ మంత్రులకు పర్సనల్ గా కాల్ చేసి ఢిల్లీకి రావాలని కోరారు. దీంతో వరంగల్ పర్యటనలో ఉన్న సీతక్క, కరీంనగర్ పాదయాత్రలో ఉన్న పొన్నం ప్రభాకర్ సహా మిగిలిన మంత్రులు హుటాహుటిన ఢిల్లీ బయల్దే రివెళ్లారు. అక్కడ న్యాయ కోవిదులతో చర్చించి సుప్రీంకోర్టు లో పెండింగ్ లో ఉన్న కేరళ, తమిళనాడు కేసులో ఇంప్లీడ్ కానున్నారు. 

ముంచుకొస్తున్న గడువు

సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు విధించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లు పూర్తి చేసింది. 2023 డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ సూచన మేరకు కులగణన నిర్వహించి బీసీల లెక్క తేల్చింది. ఈ మేరకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీనిని ఎలాగైనా అమల చేయాలని చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాయడంతోపాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా సైతం నిర్వహించింది. పార్లమెంటులో నిరసన వ్యక్తం చేసింది. రాష్ట్రపతిని కలిసి నేరుగా విజ్ఞప్తి చేసేందుకు ప్రయత్నించగా అపాయింట్ మెంట్ దొరకలేదు. వీలైనంత త్వరగా బీసీ రిజర్వేషన్లను కొలిక్కి తేవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.