అసలు మ్యాటర్ ఇది: ఢిల్లీలో ధర్నాకు రాహుల్ గాంధీ రాకపోవడంపై CM రేవంత్ క్లారిటీ

అసలు మ్యాటర్ ఇది: ఢిల్లీలో ధర్నాకు రాహుల్ గాంధీ రాకపోవడంపై CM రేవంత్ క్లారిటీ

న్యూఢిల్లీ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పి్స్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్‎లో బుధవారం (ఆగస్ట్ 6) తెలంగాణ కాంగ్రెస్ మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరుకాకపోవడంపై బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు గుప్పించాయి. రేవంత్ రెడ్డిపై నమ్మకం లేకనే రాహుల్ గాంధీ, ఖర్గే ధర్నాకు హాజరు కాలేదని విమర్శించాయి. 

ఈ క్రమంలో రాహుల్, ఖర్గే మహాధర్నాకు హాజరుకాకపోవడానికి గల కారమేంటన్నది క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ, ఖర్గే ధర్నాకు  రాకపోవడంపై కొందరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్లను చూస్తే జాలేస్తోందన్నారు. బుధవారం (ఆగస్ట్ 6) శిబూ సోరెన్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ  జార్ఖండ్ వెళ్లారని.. అందుకు నిన్నటి ధర్నాకు రాలేకపోయారని వివరణ ఇచ్చారు. తెలంగాణ కులగణన బెస్ట్ మోడల్ అని రాహుల్ గాంధీ  చెప్పింది గుర్తు లేదా అని ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు, కిషన్ రెడ్డి పస లేని, పనికి రాని వాదనలు అని కొట్టేపారేశారు. 

ALSO READ : 10 రోజుల క్రితమే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరాం..

బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు బీసీ ద్రోహులని విమర్శించారు. ఆ రెండు పార్టీలు చేస్తోన్న కుట్రలను తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తోందని హెచ్చరించారు. ముస్లింల పేరు చెప్పి 42 శాతం బీసీ రిజర్వేషన్లు అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇక, బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ శిఖండి పాత్ర పోషిస్తుందని.. కాంగ్రెస్ ఏ మంచి పని చేసినా విమర్శించడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు బీఆర్ఎస్ ఎందుకు రాలేదు..? బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ తీరుని బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. అసలు బీసీలకు మద్దతు ఇవ్వాలనే సోయి బీఆర్ఎస్‎కు ఉందా అని కడిగిపారేశారు. బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా బీజేపీకి బీఆర్ఎస్ సహకరిస్తోందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ తీరును ఎండగట్టేందుకు పీసీసీ ఆధ్వర్యంలో త్వరలోనే భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో బీజేపీ, బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పేలా కాంగ్రెస్ భవిష్యత్ కార్యచరణ ఉంటుందని స్పష్టం చేశారు.