మునుపెన్నడూ ఇలా లేదు.. సిద్ధంగా ఉండండి.. విద్యుత్ శాఖ అధికారులకు CM రేవంత్ కీలక ఆదేశం

మునుపెన్నడూ ఇలా లేదు.. సిద్ధంగా ఉండండి.. విద్యుత్ శాఖ అధికారులకు CM రేవంత్ కీలక ఆదేశం

హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో భవిష్యత్తు అంచనాలు, అవసరాలకు తగినట్లుగా విద్యుత్తు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రానికి వెల్లువెత్తిన పెట్టుబడులు, రాబోయే రోజుల్లో తెలంగాణలో జరగబోయే పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ ప్రణాళిక తయారు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో కలిసి ఇంధన శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ పలు కీలక సూచనలు చేశారు. పరిశ్రమలతో పాటు గ్లోబల్ కెపాబులిటీ సెంటర్లు (GCC), డేటా సెంటర్లు, మాస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ (మెట్రో, ఎలక్ట్రికల్‌ వెహికిల్స్‌) దృష్టిలో ఉంచుకొని పునరుత్పాదక విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. రానున్న రోజుల్లో విద్యుత్‌ అవసరాలను ముందస్తుగా అంచనా వేసి రోడ్‌మ్యాప్ సిద్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల వచ్చే మూడేండ్లలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని అధికారులను అప్రమత్తం చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మూడేండ్ల విద్యుత్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు.

ALSO READ | కేసీఆర్,హరీశ్కు కాళేశ్వరం కమిషన్ విచారణ తప్పినట్టేనా.?

గత ఏడాదితో పోలిస్తే విద్యుత్‌ డిమాండ్‌ 9.8 శాతం పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈ సంవత్సరం విద్యుత్‌ డిమాండ్‌ పెరిగింది. అయినప్పటికీ అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఈ ఏడాది విద్యుత్‌ డిమాండ్‌ అత్యధికంగా 17,162 మెగావాట్లకు చేరుకుంది. ఈ డిమాండ్‌ 2025–26 లో 18,138 మెగావాట్లు, 2034.35 నాటికి 31,808 మెగావాట్లకు పెరుగుతుందని, ఆ మేరకు అవసరాలు, అంచనాలను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. 

ప్రధానంగా క్లీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్‌పైన దృష్టి సారించాలని సీఎం చెప్పారు. ప్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కొత్తగా అమల్లోకి తెచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపైన దృష్టి సారించాలి. విద్యుత్ ఉత్పత్తిలో ప్రఖ్యాతిగాంచిన ప్రపంచ దిగ్గజ సంస్థలకు అవకాశం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్, మెట్రో విస్తరణ, రైల్వే లైన్లు, ఇతర మాస్ ట్రాన్స్‌పోర్ట్‌ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్, కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు.

జీసీసీ హబ్‎గా హైదరాబాద్ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని అన్నారు. భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్‌గా మారబోతుందని, హైదరాబాద్‌లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి అన్నారు. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్‌లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపైన హెచ్ఎండీఏ (HMDA)తో సమన్వయం చేసుకోవాలని సూచించారు.  క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేసుకోవాలి. విద్యుత్ లైన్ల ఆధునీకరణ పైన దృష్టి సారించాలి. 

ఫ్యూచర్ సీటీలో టవర్లు, పోల్స్‌, లైన్స్‌ ఏవీ బహిరంగంగా కనిపించకుండా పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా సెక్రెటేరియట్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్క్‌ వంటి ప్రాంతాల్లో ముందుగా ప్రయత్నించాలని చెప్పారు. 160 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్ పొడవునా సోలార్ విద్యుత్‌ వినియోగించుకునే ప్రణాళిక ఉండాలని, జీహెచ్ఎంసీ పరిధిలోని పుట్‌పాత్‌లు, నాలాలపై సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.