- ఎంబీబీఎస్డాక్టర్ల సూపర్‌స్పెషాలిటీ ట్రీట్మెంట్
- కమీషన్లు ఇస్తూ రెఫరల్ సిస్టమ్‌ను పెంచిపోషిస్తున్న వైనం
- తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కు పలువురిపై ఫిర్యాదులు
- నోటీసులకు స్పందన లేకపోవడంతో చర్యలకు సిద్ధం
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వివిధ హాస్పిటళ్లలో డాక్టర్లు అర్హత లేని వైద్యం చేస్తూ పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్‌తోనే ఆర్థో, న్యూరో, కార్డియాలజీ, యూరాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అందిస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. మరికొందరు డాక్టర్లు ఆర్ఎంపీ, పీఎంపీలకు, అంబులెన్స్ డ్రైవర్లకు కమీషన్లు ఇస్తూ రెఫరల్ సిస్టమ్‌ను పెంచిపోషిస్తున్నారు.
ఇలాంటి వాటిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీజీఎంసీ)కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సదరు డాక్టర్లకు టీజీఎంసీ నోటీసులు జారీ చేసి వివరణ కోరుతోంది. నోటీసులకు స్పందించని వారిపై కొరడా ఝుళిపించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
టీజీఎంసీకి అందిన ఫిర్యాదులివీ...
- మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మెడిలైఫ్ హాస్పిటల్పక్కనున్న ఓ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో ఒక డాక్టర్ తాను డీసీటీ(జనరల్)గా చెప్పుకుంటూఆర్థోపెడిక్తో పాటు ఇతర స్పెషాలిటీ కేసులకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఓ పేషెంట్ నుంచి టీజీఎంసీకి ఫిర్యాదు అందడంతో ఆ సంస్థ ప్రతినిధులు హాస్పిటల్‌ను తనిఖీ చేశారు. పేషెంట్కేస్షీట్ను పరిశీలించి సదరు డాక్టర్అర్హత లేని వైద్యం చేస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఆయన క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు, హాస్పిటల్ గుర్తింపు పత్రాలను టీజీఎంసీకి అందజేయాలని నోటీసులు జారీ చేశారు.
- ఇస్లాంపురలోని మరో హాస్పిటల్లో ఒక డాక్టర్డయాబెటాలజిస్ట్గా పబ్లిసిటీ చేసుకుంటూ డయాబెటీస్ పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎంహెచ్ఎస్సీ (డయాబెటాలజీ)ని టీజీఎంసీలో రిజిస్టర్ చేసుకోకపోవడంతో ఆయన క్వాలిఫికేషన్‌పై అనుమానాలు నెలకొన్నాయి. ఇలా ప్రజలను తప్పుదారి పట్టించడమే కాకుండా టీజీఎంసీ రూల్స్‌కు వ్యతిరేకంగా అర్హత లేని వైద్యం చేస్తున్నందుకు సదరు డాక్టర్‌కు సైతం నోటీసులు జారీ అయ్యాయి.
- జన్మభూమి నగర్‌లోని మరో హాస్పిటల్లో ఎంబీబీఎస్అర్హత గల డాక్టర్ఎమర్జెన్సీ పోస్టు గ్రాడ్యుయేట్ డాక్టర్‌గా చెప్పుకుంటున్నప్పటికీ టీజీఎంసీలో రిజిస్టర్ కాలేదు. ఆయన ఎమర్జెన్సీతో పాటు వివిధ సూపర్ స్పెషాలిటీ కేసులను టేకప్ చేస్తున్నాడు. ఆర్ఎంపీలు, అంబులెన్స్ డ్రైవర్లతో కుమ్మక్కై పేషెంట్ల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. ఆయనపై టీజీఎంసీకి ఫిర్యాదులు రావడంతో హాస్పిటల్‌ను తనిఖీ చేసి నోటీసులు జారీ చేశారు.
- జన్మభూమి నగర్లో అంబులెన్స్యజమాని ఆధ్వర్యంలో నడుస్తున్న మరో హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు లేకుండానే సూపర్ స్పెషాలిటీ వైద్యం పేరిట పేషెంట్లను మోసం చేస్తున్నారు. ఇక్కడ ఆర్ఎంవోగా ఉన్న డాక్టర్ మాత్రమే అన్ని కేసులను టేకప్చేస్తున్నాడు. పేషెంట్లను నాలుగైదు రోజులు ఉంచుకొని రూ.లక్ష బిల్లు కాగానే ఇక మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. అప్పటికే పేషెంట్ పరిస్థితి విషమంగా మారడంతో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌కు రెఫర్ చేస్తున్నారు.
- ఐబీ చౌరస్తా సమీపంలో సొంత హాస్పిటల్నడుపుతున్న మరో డాక్టర్ ఎంఎస్ జనరల్సర్జన్కడుపు నొప్పితో వచ్చిన మహిళలకు గర్భసంచి ఆపరేషన్లు చేయడంలో స్పెషలిస్టుగా పేరుంది. ఆయన తనకు సంబంధం లేని యూరాలజీ ట్రీట్మెంట్అందిస్తూ పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ఇలాగే ఓ పేషెంట్‌కు కిడ్నీ స్టెంట్ వేయడంతో అతడి కండీషన్ సీరియస్‌గా మారింది. బాధితుడి ఫిర్యాదుతో సదరు డాక్టర్‌కు టీజీఎంసీ నోటీసులు ఇచ్చింది.
ఆర్ఎంపీ, పీఎంపీల ద్వారా రెఫరల్
బెల్లంపల్లి చౌరస్తా సమపంలోని ఓ పిల్లల డాక్టర్ ఆర్ఎంపీ, పీఎంపీలతో కలిసి ఫ్రీ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ వారి ద్వారా రెఫరల్ వ్యవస్థను ప్రమోట్చేస్తున్నట్టు టీజీఎంసీకి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. అలాగే ఇటీవల రెండు పిల్లల హాస్పిటళ్లలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చనిపోయారంటూ బంధువులు ఆందోళనకు దిగారు.
మీడియాలో వచ్చిన కథనాలను సుమోటా తీసుకున్న టీజీఎంసీ ప్రతినిధులు సదరు హాస్పిటళ్లలో ఎంక్వైరీ జరిపి టీజీఎంసీకి రిపోర్ట్ పంపారు. సుమైరాస్ హోమియో అండ్ఈస్తటిక్ క్లినిక్‌పై వచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీ నిర్వహించి తదుపరి చర్యల కోసం టీజీఎంసీతో పాటు డీఎంహెచ్‌వోకు రిపోర్టు అందజేశారు.
అర్హత లేని వైద్యం చేస్తే చర్యలు తప్పవు
మంచిర్యాల జిల్లాలో పలువురు డాక్టర్లు తమ అర్హతలకు మించి స్పెషాలిటీ వైద్యం అందిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు డాక్టర్లపై టీజీఎంసీకి ఫిర్యాదులు అందాయి. సదరు హాస్పిటళ్లలో ఎంక్వైరీ జరిపి గుర్తించిన లోపాలపై నోటీసులు జారీ చేశాం. నోటీసులకు స్పందించని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. - డాక్టర్ యెగ్గన శ్రీనివాస్, టీజీఎంసీ మెంబర్
