- 2 విడతల్లో 70 కిలోమీటర్ల ఓఆర్ఆర్ పనులకు ప్లాన్
- మామునూర్ ఎయిర్పోర్ట్, టెక్స్‌టైల్‌పార్క్ వెళ్లేలా 4 లైన్ల ఎన్‌హెచ్ రోడ్డు
- డీపీఎస్ నుంచి ఎయిర్పోర్ట్ మీదుగా సంగెం వరకు 31 కి.మీ రోడ్డు
- అందుబాటులో డీపీఎస్ నుంచి దామెర వరకు 29 కి.మీ 163 ఎన్‌హెచ్
- దామెర నుంచి మరో 10 కి.మీ కలిసి రానున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే
వరంగల్, వెలుగు: ఓరుగల్లులో మరో మెగా ప్రాజెక్ట్ ఓఆర్ఆర్ నిర్మాణానికి అడుగులు పడ్తున్నాయి. సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం నర్సంపేటలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఈ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
హైదరాబాద్‌తో సమానంగా గ్రేటర్ వరంగల్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యమని చెప్పారు. సిటీ చుట్టూ ఇప్పటికే ఇన్నర్ రింగ్‌రోడ్డు పనులు చివరి దశకు చేరుకోగా, మామునూర్ ఎయిర్పోర్ట్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్వంటి మేజర్ ప్రాజెక్టులకు అనుసంధానంగా 70 కిలోమీటర్ల ఓఆర్ఆర్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. నేషనల్ హైవే అథారిటీ ఈ పనులు చేపట్టేలా ప్లాన్ చేస్తున్నారు.
నష్కల్ డీపీఎస్ నుంచి ఖమ్మం హైవే ఎయిర్పోర్ట్..
వరంగల్‌లో పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని ఇన్నర్ రింగ్‌రోడ్డు పనులు చేపట్టారు. ఆపై విలీన గ్రామాలు కలవడం, వరంగల్ కేంద్రంగా హైదరాబాద్‌తోపాటు విజయవాడ, చత్తీస్గడ్, నిజామాబాద్ వైపు నేషనల్ హైవేలు రావడంతో ప్రధాన రోడ్లన్నీ రద్దీగా మారడంతో 70 కిలోమీటర్లతో ఓఆర్ఆర్ కోసం ప్రతిపాదనలు చేశారు.
ప్రస్తుతం ఓరుగల్లులో మామునూర్ ఎయిర్పోర్ట్, దీనికి దగ్గర్లోనే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ సైతం రావడంతో ఇవన్నీ ఒకే సర్క్యూట్లో వచ్చేలా 4 లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి వరంగల్ వచ్చే క్రమంలో నష్కల్ కరుణాపురం వద్దనున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరియా ఓఆర్ఆర్ సెంటర్ అవనుంది.
ఈ జంక్షన్ నుంచి ఎడమ వైపు ధర్మసాగర్, ఉనికిచర్ల, దేవన్నపేట మీదుగా భూపాలపల్లి వైపు ఇప్పటికే ఓఆర్ఆర్ ఉంది. కాగా, ఇక్కడి నుంచి కుడివైపు కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ రింగ్ రోడ్ వేయనున్నారు. దాదాపు 10 నుంచి 12 గ్రామాల మీదుగా మామునూర్ ఎయిర్‌పోర్ట్‌ను ఆనుకుని ఉండే ఖమ్మం నేషనల్ హైవేకు బొల్లికుంట ప్రాంతంలో కలిపేలా రోడ్డు వేస్తారు. అక్కడి నుంచి సంగెం మండల కేంద్రం మీదుగా వెళ్లే గ్రీన్‌ఫీల్డ్ హైవేకు దీనిని కలిపేలా ప్లాన్ రూపొందిస్తున్నారు.
2 ఫేజుల్లో 31 కిలోమీటర్ల ఓఆర్ఆర్..
వరంగల్ ఔటర్ రింగ్‌రోడ్డు కోసం దాదాపు 70 కిలోమీటర్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, 31 కిలోమీటర్ల కొత్త 4 లేన్ల రోడ్డుతోనే ఓఆర్ఆర్ పూర్తికానుంది. హైదరాబాద్ నుంచి వచ్చే క్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌వద్ద నుంచి భూపాలపల్లి మీదుగా చత్తీస్గడ్ వెళ్లే నేషనల్ హైవే_163 అందుబాటులో ఉంది.
డీపీఎస్ నుంచి ఎడమ వైపుగా ధర్మసాగర్, ఉనికిచర్ల, దేవన్నపేట, భీమారం, పలివేల్పుల, ముచ్చర్ల క్రాస్, వంగపహాడ్ మీదుగా దామెర జంక్షన్‌లోని ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్ వరకు 29 కిలోమీటర్ల నేషనల్ హైవే ఓఆర్ఆర్కు అనుసంధానంగా ఉంది. కాగా, ఇదే ప్రాంతం మీదుగా మంచిర్యాల నుంచి వరంగల్ మీదుగా విజయవాడ వెళ్లే గ్రీన్‌ఫీల్డ్ హైవే టెక్స్ టైల్ పార్క్ ఉండే సంగెం మండలం వరకు 10 కిలోమీటర్లు కలిసిరానుంది.
ఈ క్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్నుంచి పలు గ్రామాలమీదుగా మొదటి ఫేజ్‌లో.. మామునూర్ ఎయిర్పోర్ట్ సమీపంలోని వరంగల్_ఖమ్మం హైవే వరకు 20 కిలోమీటర్లు, సెకండ్ ఫేజ్‌లో అక్కడినుంచి సంగెం మండలంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవే వరకు మరో 10 కిలోమీటర్లతో మొత్తంగా 31 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉంది.
ఓఆర్ఆర్తో ఎయిర్పోర్ట్ జర్నీ ఈజీ..
వరంగల్ చుట్టూ పూర్తిస్థాయిలో నిర్మించే ఔటర్ రింగురోడ్డుతో ప్రధానంగా మామునూర్ ఎయిర్‌పోర్ట్‌తోపాటు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వెళ్లేవారికి జర్నీ చాలా ఈజీ అవనుంది. హైదరాబాద్ మార్గంలో ఆలేరు, జనగామ, సిద్దిపేట వైపు నుంచి ఎయిర్పోర్ట్ వెళ్లేవారు గతంలో మాదిరి వరంగల్ సిటీకి వెళ్లకుండా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి ఖమ్మం హైవే వరకు కొత్తగా నిర్మించే 4 లేన్ల రోడ్డులో సాఫీగా వెళ్లవచ్చు. కరీంనగర్ నుంచి వచ్చేవారు భీమారం వద్ద నుంచి దామెర జంక్షన్ మీదుగా ఓఆర్ఆర్ ద్వారా ఎయిర్పోర్ట్ వద్దకు చేరుకోవచ్చు.
ఖమ్మం వైపునుంచి వచ్చేవారు గ్రీన్‌ఫీల్డ్ హైవే నుంచి సంగెం జంక్షన్ మీదుగా నిమిషాల్లో ఎయిర్పోర్ట్ చేరవచ్చు. ఇప్పటికే వరంగల్_తొర్రూర్ మీదుగా ఖమ్మం నేషనల్ హైవే ఉండి దానిని కూడా 4 లేన్లుగా ప్లాన్ చేయడంతో మొత్తంగా ఓరుగల్లు చుట్టూ ఉండే 10 నుంచి 15 జిల్లాల ప్రయాణికులు సాఫీగా మామునూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకునేలా కొత్త ఓఆర్ఆర్ ఉపయోగపడనుంది.
