- జూబ్లీహిల్స్ ఓటమితో మరింత డౌన్‌ఫాల్: మంత్రి వివేక్ వెంకటస్వామి
- ఊళ్లల్లో ఆ పార్టీకి క్యాడర్ కూడా లేదు.. సర్పంచ్ ఎన్నికల్లో మాకు పోటీనే కాదు
- అన్ని స్థానాల్లో గెలిచి క్లీన్‌స్వీప్ చేస్తామని ధీమా
సిద్దిపేట, వెలుగు: బీఆర్ఎస్ పనైపోయిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమితో బీఆర్ఎస్ మరింత డౌన్‌ఫాల్ అయింది. ఆ పార్టీకి ఇప్పుడు ఊళ్లల్లో క్యాడర్ కూడా లేకుండా పోయింది. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు మాకు పోటీనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లో గెలిచి క్లీన్‌స్వీప్ చేస్తం” అని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం గజ్వేల్‌లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్‌లో వివేక్ పాల్గొన్నారు. కాంగ్రెస్ మద్దతుతో ఏకగ్రీవమైన వార్డు మెంబర్ అభ్యర్థులను సన్మానించారు. పంచాయతీ ఎన్నికలపై పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అలాగే సిద్దిపేటలో మీడియాతోనూ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉందని వివేక్ అన్నారు.
‘‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టైమ్‌లో మనం గెలవడం కష్టమని అన్నారు. కానీ అక్కడ గెలిచి చూపించాం. ఇప్పుడు గజ్వేల్‌లోనూ అన్ని సర్పంచ్, వార్డు స్థానాలను గెలిచి మన సత్తా చూపెట్టాలి” అని కార్యకర్తలకు వివేక్ పిలుపునిచ్చారు. పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. ‘‘జూబ్లీహిల్స్ ఓటమితో బీఆర్ఎస్ పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పుడు ఆ పార్టీకి క్యాడర్ కూడా లేకుండా పోయింది. ఇదే మనకు మంచి అవకాశం. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి” అని పిలుపునిచ్చారు. సిద్దిపేటలో గతంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పని చేస్తున్నారని ప్రశంసించారు. ప్రజాపాలనను మెచ్చి జనం జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపించారని పేర్కొన్నారు.
రెండేండ్లలో ఎంతో చేసినం..
కేసీఆర్ కుటుంబంలో ఆస్తుల గొడవ మొదలైందని మంత్రి వివేక్ అన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌పాలనలో జరిగిన అవినీతిని కేసీఆర్ కూతురు కవితనే బయటపెట్టారని పేర్కొన్నారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారు. ఆ అప్పులకు వడ్డీల కిందనే మేం ఇప్పుడు నెలకు రూ.5 వేల కోట్లు కడుతున్నం. పదేండ్ల పాలనలో ఇచ్చిన ఒక్క హామీని కూడా బీఆర్ఎస్ అమలు చేయలేదు. కానీ ఇప్పుడు రెండేండ్లలో కాంగ్రెస్ఏం చేసిందని కేటీఆర్, హరీశ్‌రావు అడగడం సిగ్గుచేటు. మేం రెండేండ్లలో వేలాది ఉద్యోగాలు ఇచ్చాం.
మరో 40 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయనున్నం. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో బీఆర్ఎస్ మోసం చేస్తే, మేం 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సిద్దిపేట జిల్లా ముందున్నది. 5 లక్షల మంది పేదలకు కొత్త రేషన్‌కార్డులు ఇచ్చాం. మహిళా సంఘాలకు రూ.22 వేల కోట్లు వడ్డీ లేని రుణాలిచ్చాం. మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు కేటాయిస్తున్నాం” అని తెలిపారు. గజ్వేల్‌లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాజీ డీసీసీ ప్రెసిడెంట్తూంకుంట నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేటలో మీడియా సమావేశంలో పూజల హరికృష్ణ, అత్తు ఇమామ్, బొమ్మల యాదగిరి, గంప మహేందర్ రావు, మార్క సతీశ్ కుమార్, కలీమొద్దీన్, దాస అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
