రెండో విడతలో 415 సర్పంచ్‌‌లు ఏకగ్రీవం..8,304 వార్డు స్థానాలు కూడా..

రెండో విడతలో 415 సర్పంచ్‌‌లు ఏకగ్రీవం..8,304 వార్డు స్థానాలు కూడా..
  • తేలిన రెండో విడత నామినేషన్ల లెక్క.. 
  • 3,911 సర్పంచ్​ స్థానాలకు 13,128, 29,903 వార్డులకు 78,158 మంది పోటీ
  • కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 44 సర్పంచ్, 776 వార్డు మెంబర్స్​ ఏకగ్రీవం 
  • 14న పోలింగ్​.. ఫలితాలు

హైదరాబాద్, వెలుగు:  పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొదటి, రెండో విడత ఎన్నికల్లో ఎన్ని గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి? ఎంతమంది అభ్యర్థులు బరిలో నిలిచారు? అనేది తేలిపోయింది.  మూడోవిడత నామినేషన్ల లెక్క తేలగా.. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయింది. 9న ఉపసంహరణ ఉంటుంది. కాగా, రెండో విడత  బరిలో నిలిచిన అభ్యర్థుల లెక్క కొలిక్కి వచ్చింది. మొత్తం 4,332 గ్రామ పంచాయతీలకుగానూ 415 మంది సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. పలు కారణాలతో 5 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 3,911 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు  జరగనుండగా.. 13,128 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.  ఈ విడతలో 38,322 వార్డులకుగానూ.. ఏకంగా 8,304 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 107 వార్డుల్లో ఎవరూ నామినేషన్లు వేయలేదు. ఇక మిగిలిన 29,903 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. మొత్తం 78,158 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 

ఏకగ్రీవాల్లో కామారెడ్డి జిల్లా టాప్​

రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవాల్లో కామారెడ్డి జిల్లా టాప్‌‌లో నిలిచింది.  ఈ జిల్లాలో 197 పంచాయతీలకు అత్యధికంగా 44 సర్పంచ్‌‌లు ఏకగ్రీవమయ్యారు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో 196 సర్పంచ్‌‌లకు 38, నల్గొండ జిల్లాలో 282 సర్పంచ్‌‌లకు 38 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వార్డుల్లోనూ కామారెడ్డి జిల్లానే టాప్‌‌లో నిలిచింది. ఈ జిల్లాలో 1,654 వార్డులకుగానూ  776 ఏకగ్రీవమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 1,760 వార్డులకు  674, నల్గొండ  జిల్లాలో 2,418 వార్డులకు 553 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా,కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా కేవలం ఒక సర్పంచ్, మంచిర్యాల, వరంగల్ జిల్లాల్లో కేవలం 2 చొప్పున సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 241, సంగారెడ్డిలో 229 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.  సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 1,941 వార్డులకు, నల్గొండలో 1,831 వార్డులకు ఎన్నికలు ఉంటాయి. రెండో విడతలో దాదాపు 10 శాతం పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన చోట్ల హోరాహోరీ పోరు నెలకొన్నది. సర్పంచ్ స్థానానికి సగటున ముగ్గురు నుంచి నలుగురు, వార్డు స్థానానికి సగటున ఇద్దరు నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాగా, రెండో విడత14న పోలింగ్​ నిర్వహించనుండగా.. అదేరోజు విజేతలను ప్రకటించనున్నారు.   

9న మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ

ఈ నెల 9న మూడో విడత నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటిస్తారు. ఇదే సమయంలో గుర్తుల కేటాయింపు ఉంటుంది.  పోలింగ్ 17వ తేదీన నిర్వహించనున్నారు.  ఆఖరిరోజు  సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ స్థానాలకు 17,405, వార్డులకు 61,562 నామినేషన్లు రావడం విశేషం.  మూడో విడతలో  4,158 పంచాయతీలకుగానూ 27,277 నామినేషన్లు దాఖలు కాగా,  36,442 వార్డులకుగానూ 89,603 మంది నామినేషన్లు వేశారు. ఈ విడత 11 సర్పంచ్​, 100 వార్డులకు ఒక్క నామినేషన్​ కూడా రాలేదు.  నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో నామినేషన్లు పెద్ద సంఖ్యలో వచ్చాయి. ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలో అత్యల్పంగా నామినేషన్లు దాఖలయ్యాయి.