మెట్రో విజయవంతంగా నడుస్తోంది: ఎన్వీఎస్ రెడ్డి

మెట్రో విజయవంతంగా నడుస్తోంది: ఎన్వీఎస్ రెడ్డి

ఐదేళ్ల క్రితం ప్రారంభమైన మెట్రో రైల్ విజయవంతంగా నడుస్తోందని ఆ సంస్థ ఎండి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రారంభించిన రోజు నుంచే నగరవాసులు మెట్రోని ఆదరించారన్నారు. కోవిడ్ తర్వాత నిన్న (సోమవారం) అత్యధికంగా 4.4 లక్షల మంది మెట్రోలో ప్రయాణించారని వెల్లడించారు. నగరంలో మరింత అద్భుతంగా మెట్రో రూపుదిద్దుకోనుందన్నారు. ఈ క్రమంలో ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరణకు ముహూర్తం ఖరారైందన్నారు. సీఎం కేసీఆర్ డిసెంబర్ 9వ తేదీన మైండ్ స్పెస్ వద్ద శంకుస్థాపన చేస్తారని తెలిపారు.

ప్రస్తుతం ఉన్న రాయదుర్గం మెట్రోస్టేషన్ నుంచి 0.9 కిలోమీటర్ దూరం వరకు ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ మెట్రో ప్రారంభం కానుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అక్కడి వరకు ప్రస్తుత మెట్రో రైలు పరిధిని పెంచుతామన్నారు. 31 కిలోమీటర్ల పొడవు ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ మెట్రో ఉండనుందని స్పష్టం చేశారు. నాగోల్ నుంచి రాయదుర్గం గ్రీన్ లైన్ కు కనెక్ట్ చేస్తామని చెప్పారు. 31 కి.మీ ఎయిర్ పోర్టు మెట్రో 28 కి ఎలీటెడ్, సుమారు 3 కి.మీ అండర్ గ్రౌండ్ నిర్మించే దిశగా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఇక్కడే ఎయిర్ పోర్ట్ లగేజ్ చెక్ ఇన్ ఉండేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు. ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ కనెక్టివిటీతో వరల్డ్ క్లాస్ సిటీగా హైదరాబాద్ నిలుస్తుందన్నారు. రాష్ట్ర సొంత డబ్బులతో ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ మెట్రో నిర్మాణానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని మెట్రో ఎండీ వెల్లడించారు.