చంద్రబాబు బతుకంతా వాగ్దానాలు.. వెన్నుపోట్లే

చంద్రబాబు బతుకంతా వాగ్దానాలు.. వెన్నుపోట్లే
  • బాబు అంటేనే వెన్నుపోటు, మోసం, దగా, కుట్ర 
  • చంద్రబాబు అండ్​ కో ది పెత్తందారి మనస్తత్వం
  • పేదలకు మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేరు
  • బీజేపీ, దత్తపుత్రుడు.. వీరిని నేను నమ్ముకోలేదు
  • పక్క రాష్ర్టాల మేనిఫెస్టోలు కాపీ కొడుతున్న టీడీపీ
  • మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలవండి
  • జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభోత్సవంలో ఏపీ సీఎం వైఎస్​ జగన్​

టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు బతుకంతా వాగ్దానాలు ఇవ్వడం వెన్నుపోట్లు పొడవటంతో నిండిపోయిందని ఏపీ సీఎం వైఎస్​ జగన్​ మోహన్​రెడ్డి  ఘాటు వ్యాఖ్యలు చేశారు. జూన్​ 12 న నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుక పథకాన్ని పల్నాడు జిల్లా క్రోసూరులో ఆయన ప్రారంభించారు.  అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ..  పేద పిల్లలకు నాణ్యమైన విద్యా బోధన కోసం ట్యాబ్​లు విద్యా సామగ్రి అందిస్తూ.. ఇంగ్లీష్​ మీడియంలో చదివిస్తుంటే.. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. చంద్రబాబు అండ్​కో ది పెత్తందారి మనస్తత్వం అని, వారు పేదలకు వ్యతిరేకమని విమర్శించారు. బాబు అధికారంలో ఉన్నప్పుడూ  ఇదే బడ్జెట్​ ఉందని కానీ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.  14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ప్రజలకు పని కొచ్చే ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేయలేదని, ఆయన పేరు చెప్పితే గుర్తుకొచ్చేది మోసం, దగా, కుట్ర, వెన్నుపోటని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దత్త పుత్రుడు తదితరులు అంతా కలిసి దుష్టచతుష్టయం, గజదొంగల ముఠాగా మారి పేదలకు అన్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పక్క రాష్ర్టాల ఎన్నికల్లో పలు పార్టీలు అమలు చేసిన మేనిఫెస్టోని ఇక్కడా కాపీ చేసి పులిహోర లా మన ముందుంచుతున్నారని ఆరోపించారు.  వారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన సంక్షేమం ఏంటో ఇప్పటి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం ఏంటో తెలుసుకుని ఉండాలని ప్రజలను కోరారు.  ప్రతి కుటుంబంలో మంచి జరిగితే తనకు అండగా నిలవాలని, చంద్రబాబు అండ్​ కో చేసే దుష్ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విన్నవించారు. గ్యాస్​ సిలిండర్​ డిక్లరేషన్​, బీసీ డిక్లరేషన్​ అంటూ మళ్లీ మోసం చేయడానికి గజదొంగల ముఠా వస్తోందని వ్యంగ్యస్ర్తాలు సంధించారు. 

బీజేపీ, దత్తపుత్రుడి అండ లేకున్నా..

గడిచిన రెండు రోజుల్లో ఏపీలో పర్యటించిన హోం మంత్రి అమిత్​షా,  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జగన్​ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై సీఎం స్పందిస్తూ.. దత్తపుత్రుడు, బీజేపీ, పలు మీడియా సంస్థల అండ లేకున్నా ప్రజలు తన వెంట ఉన్నారనే ధైర్యంతో పని చేస్తున్నానని తెలిపారు.

ఓటర్లు కాకపోయినా.. మామయ్యలా అండగా నిలిచా

బడి పిల్లలు ఓటర్లు కాదు.. అయినా జగన్​ మామయ్య కానుకలు ఇస్తున్నాడు.. అని సీఎం జగన్మోహన్​రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ విద్యార్థులు ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలోకి రావాలనే వారికోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. కళ్యాణమస్తు, షాదీతోఫాతో చదువులను ప్రోత్సహిస్తున్నామన్నారు. విద్యారంగంపై ఇప్పటివరకు రూ.60,329 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. 43 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక పథకం ద్వారా లబ్ధి చేకూరుతున్నట్లు వివరించారు. జులై 12 నుంచి అన్ని బడుల్లో డిజిటల్​క్లాసులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.  జగనన్న విద్యా కానుకలో నోట్ బుక్స్​, బైలింగ్యులర్​ పుస్తకాలు, జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్ట్​తదితర విద్యా సామగ్రి ఉంటాయి.