ప్రధానిని కలిస్తే నాపై దుష్ప్రచారం: సీఎం జగన్‌ 

ప్రధానిని కలిస్తే నాపై దుష్ప్రచారం: సీఎం జగన్‌ 

ప్రధాని మోడీని కలిస్తే చాలు తనపై దుష్ప్రచారం చేస్తారని.. బీజేపీ, కాంగ్రెస్‌తో అంటకాగిన వాళ్లు తనను విమర్శిస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ ఆరోపించారు. మే 16వ తేదీ మంగళవారం ఆయన బాపట్ల జిల్లా నిజాంపట్నం వేదికగా అయిదో విడత వైఎస్సార్‌ మత్స్యకార భరోసా నిధులను సీఎం జగన్‌ విడుదల చేశారు. కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి 1,23,519 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో మాట్లాడారాయన. పొత్తులు పెట్టుకొని.. తెగదెంపులు చేసుకునేది వీళ్లే.. వివాహాలు చేసునేది వీళ్లే.. విడాకులు తీసుకునేది వీళ్లే ఎద్దేవ చేశారు. ఎన్నికలప్పుడే చంద్రబాబాకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు గుర్తొస్తారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్కపథకం గుర్తు రాదని విమర్శించారు జగన్.

గత ప్రభుత్వంలో మత్స్యకారులకు అరకొర సాయం మాత్రమే అందిందని జగన్ వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వంలో రూ. 4వేలు.. అది కూడా కేవలం కొందరికి మాత్రమే అందేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు మాత్రమే.. తమ ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే రూ. 231 కోట్లు ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి తేడా గమనించాలని కోరారు జగన్. గతంలో 1100 బోట్లు, ఇప్పుడు 20వేల బోట్లకు సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. గతంలో డీజిల్‌పై రూ.6 ఇస్తే.. ఇప్పుడు రూ.9 సబ్సిడీ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఎన్ని వ్యవస్థలను తనపై ప్రయోగించినా 15 ఏళ్లుగా ఎక్కడా రాజీపడకుండా.. ప్రజల తరపున నిలబడ్డానని సీఎం జగన్ చెప్పారు.