నో బిన్.. నో ట్రేడ్.. షాపుల వద్ద డస్ట్ బిన్ లేకుంటే లైసెన్స్ క్యాన్సిల్

నో బిన్.. నో ట్రేడ్.. షాపుల వద్ద డస్ట్ బిన్ లేకుంటే లైసెన్స్ క్యాన్సిల్
  • సీఎంసీలో నిధుల కొరత లేదు
  • పెద్ద ప్రాజెక్టుల కోసం ప్రభుత్వాన్ని నిధులు అడిగాం
  • సీఎంసీ హెడ్ ఆఫీస్ లో  కమిషనర్ సృజన చిట్​చాట్

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్​ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ‘నో బిన్.. నో ట్రేడ్’ విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తామని సీఎంసీ కమిషనర్ సృజన తెలిపారు. ప్రతి దుకాణం ముందు తప్పనిసరిగా డస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బిన్ ఉండాలని, చెత్తను రోడ్లపై వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం మాదాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని న్యాక్ భవనంలోని సీఎంసీ కార్యాలయంలో ఆమె మీడియాతో చిట్​చాట్​ నిర్వహించారు. జనావాసాల వద్ద రోడ్లపై చెత్త వేస్తే మున్సిపల్ సిబ్బంది తొలగిస్తారని, కానీ వాణిజ్య సంస్థలు, మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద చెత్తను పారవేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. 

డస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిన్ ఏర్పాటు చేయని దుకాణాల ట్రేడ్ లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. ‘వన్ డే – వన్ సర్కిల్ విజిట్’ తరహాలో వార్డులను సందర్శించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. సీఎంసీలోని 16 సర్కిళ్లను ఇప్పటికే మూడుసార్లు సందర్శించినట్లు చెప్పారు. సీఎంసీ ప్రధాన కార్యాలయ భవనాన్ని హైటెక్ సిటీ–మాదాపూర్ ప్రాంతంలో నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో ప్రస్తుతం రెండు విధానాలు అమలులో ఉన్నాయని తెలిపారు. పాత జీహెచ్ఎంసీ పరిధిలో రెంటల్ వ్యాల్యూ, విలీన మున్సిపాలిటీల్లో కాపిటల్ వ్యాల్యూ ఆధారంగా ట్యాక్స్ వసూలు చేస్తున్నామని, దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

 అమీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ రోడ్డు విస్తరణ పనులు సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని, త్రిపుల్ ఐటీ జంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మూడు ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని మార్చి 2027 నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాస్ పనులు మే–జూన్ నాటికి పూర్తి అవుతాయని చెప్పారు. ఖాజాగూడ జంక్షన్ ఫ్లైఓవర్ నిర్మాణం ఏప్రిల్ 2027 నాటికి పూర్తవుతుందని వెల్లడించారు.

ఫిర్యాదులపై తక్షణ స్పందన..

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రతి విభాగానికి సిస్టమ్ ఆఫ్ ప్రొసీజర్ రూపొందించామని కమిషనర్​ తెలిపారు. సోషల్ మీడియా, ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి 24 గంటల్లో బాధితులకు అధికారులు ఫోన్ చేయాలని, 48 గంటల్లో సమస్యపై వివరాలు సేకరించి పరిష్కార చర్యలు ప్రారంభించాలని ఆదేశించినట్లు చెప్పారు.

నిధుల కొరత లేదు..

సీఎంసీలో నిధుల కొరత లేదని సృజన తెలిపారు. ప్రస్తుతం పెండింగ్ బిల్లులు రూ.150 కోట్లు ఉన్నాయని చెప్పారు. అభివృద్ధి పనులకు మొత్తం రూ.430 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. హెచ్-సిటీ ప్రాజెక్టుల కోసం రూ.2,500 కోట్లు అవసరమని, నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు. 

ఫ్లైఓవర్ల కింద ఈటింగ్​ జోన్లు..

సీఎంసీ పరిధిలో ఉన్న ఆస్తులను గుర్తించామని తెలిపారు. 428 షాపులు, 24 స్పోర్ట్స్ కాంప్లెక్సులు, 21 మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్, 357 కమ్యూనిటీ హాల్స్, 1590 ఓపెన్ స్పేసెస్, 21 ఫ్లైఓవర్లు ఉన్నాయని వివరించారు. ఫ్లైఓవర్ల క్రింద స్పోర్ట్స్ ఫెసిలిటీలు, ఈటింగ్ జోన్లు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు.