
- నిర్దేశించిన సీఎండీ బలరాం..అన్ని ఏరియాల జీఎంలతో సమీక్ష
హైదరాబాద్, వెలుగు: ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మొదటి 3 నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకొని 160 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 1200 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ (ఓబీ) తొలగింపు టార్గెట్స్‌ను సాధించాలని ఏరియా జనరల్ మేనేజర్లను సింగరేణి సీఎండీ ఎన్. బలరాం ఆదేశించారు. 2024 ఏప్రిల్‌లో 5.66 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా చేయగా, ఈ ఏప్రిల్‌లో 2.7 శాతం వృద్ధితో 5.81 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా సాధించినట్లు చెప్పారు.
శనివారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్‌లో అన్ని ఏరియాల జీఎంలతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా బలరాం మాట్లాడారు. బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా, నాణ్యత అంశాలపై సమీక్షించారు. నిరుడు ఏప్రిల్‌లో 36.18 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగించగా, ఈ ఏప్రిల్‌లో 10.6 శాతం వృద్ధితో 40 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగించినట్లు వెల్లడించారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ నిర్దేశించిన టార్గెట్ సాధించాలని అధికారులను ఆదేశించారు.
నెలలోగా నైనీబ్లాక్కు సిబ్బందిని పంపాలి
ఒడిశాలో కొత్తగా ప్రారంభించిన నైనీ బొగ్గు బ్లాక్‌లో పనిచేసేందుకు సూపర్వైజరీ సిబ్బందిని ఎంపిక చేసి, నెల రోజుల్లోగా పంపించాలని బలరాం సూచించారు. కొత్తగా నియమితులైన ఉద్యోగులకు భూగర్భ గనుల్లో పనిచేసేలా పోస్టింగ్‌లు ఇవ్వాలని అన్నారు.