సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లపై చర్యలు తీసుకోండి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లపై చర్యలు తీసుకోండి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
  •     కలెక్టర్​ ఆదర్శ్​ సురభి

వనపర్తి టౌన్, వెలుగు: జిల్లాలో సీఎంఆర్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి వడ్ల కొనుగోలు, మిల్లర్ల నుంచి రావాల్సిన సీఎంఆర్ పై సమీక్ష నిర్వహించారు. 

వడ్లను అనధికారికంగా మిల్లులకు తరలించే కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. అలాంటి సెంటర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని, కమీషన్ డబ్బులు కూడా ఆపేయాలని సూచించారు. జిల్లాలో మరో 20 వేల టన్నుల ధాన్యానికి సంబంధించిన డబ్బులు పెండింగ్​ఉన్నాయని, వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. 

సీఎంఆర్​అప్పగించని మిల్లర్ల జాబితా రూపొందించి, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గత యాసంగి సీజన్​కు సంబంధించిన సీఎంఆర్ పూర్తి చేయని వారికి  ధాన్యం కేటాయించేది లేదన్నారు. కార్యక్రమంలో డీసీఎస్వో కాశీ విశ్వనాథ్, డీఎం జగన్, డీసీవో  రాణి  పాల్గొన్నారు.