ఆర్మూర్, వెలుగు: పూర్తి స్థాయిలో సర్వే చేసి అర్హులైన పార్టీ నాయకులకే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ కేటాయిస్తుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేశ్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆర్మూర్ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మార్కెట్ కమిటి చైర్మన్ సాయిబాబాగౌడ్ అధ్యక్షతన బుధవారం ఆర్మూర్ లో కాంగ్రెస్ పార్టీ టౌన్ మీటింగ్ నిర్వహించారు.
అంతకుముందు ఆశావహుల నుంచి కౌన్సిలర్ టికెట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా 147 మంది తమ దరఖాస్తులను అందజేశారు. అనంతరం డీసీసీ ప్రెసిడెంట్ నగేశ్ రెడ్డి మాట్లాడుతూ.... అభ్యర్థుల ఎంపిక, విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణపై పార్టీ ఆదేశాల ప్రకారమే జరుగుతుందన్నారు. అభ్యర్థుల పేర్లను టీపీసీసీకి కు పంపిస్తామని తుది జాబితాను పార్టీ అధిష్టానం ప్రకటిస్తుందన్నారు.
అధిష్టానం ఎవరికి టిక్కెట్ ఇచ్చిన ఆ అభ్యర్థి గెలుపుకోసమే పార్టీ శ్రేణులు పనిచేయాలని చెప్పారు. పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడాలని, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించే వారిపై చర్య తీసుకుంటామన్నారు.
సమావేశంలో ఆర్మూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి, మార చంద్రమోహన్, ఏబీ చిన్నా, నాయకులు మోత్కురి లింగాగౌడ్, సంజయ్ సింగ్ బబ్లు, పండిత్ పవన్, అయ్యప్ప శ్రీనివాస్, షేక్ మున్నా, విట్టం జీవన్ , ఖాందేశ్ శ్రీనివాస్, మహమూద్ అలీ, రేగుల్ల సత్యంనారాయణ పాల్గొన్నారు.
