లింగంపేట,వెలుగు: లింగంపేట మండలం మెంగారం గ్రామ శివారులో చిరుత సంచరిస్తుండడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. గ్రామ సమీపంలో కొత్తపల్లి బాలసాయిలు అనే రైతు తన భూమిలో కూరగాయలు సాగు చేస్తున్నాడు. మంగళవారం ఉదయం చేను వద్ద కు వెళ్లిన బాలసాయిలు పొలంలో చిరుత సంచరించినట్లు గమనించాడు. చిరుత పాదముద్రలను గుర్తించి గ్రామస్థులకు సమాచారం అందించాడు.
తాగునీటికోసం చిరుత పంటచేను వద్దకు వచ్చి ఉంటుందని గ్రామస్థులు భావిస్తున్నారు.గ్రామానికి కూతవేటు దూరంలో చిరుత సంచరించడం పట్ల గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గతంలో మెంగారం శివారులో చిరుత రెండు లేగదూడలను హతమార్చినట్లు గ్రామస్థులు చెప్పారు.అటవీశాఖ అధికారులు బోను ఏర్పాటు చేసి చిరుతను బందించి జూ పార్కునకు తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
