సీఎం శంకుస్థాపన చేసిన పనులు ఏడిదాకొచ్చినయ్?... కలెక్టర్లు, అధికారులను ఆరా తీసిన సీఎంవో

సీఎం శంకుస్థాపన చేసిన పనులు ఏడిదాకొచ్చినయ్?... కలెక్టర్లు, అధికారులను ఆరా తీసిన సీఎంవో
  • 18 నెలల్లో అనేక అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు
  • ఆయా పర్యటనల్లో స్థానికంగా పలు హామీలు
  • వాటి పరిస్థితిపై లేటెస్ట్ రిపోర్ట్​కు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశం

హైదరాబాద్​, వెలుగు: బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సీఎం రేవంత్​రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్ల విలువైన ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆయా పర్యటనల్లో స్థానికంగా పనులు హామీలు ఇచ్చారు. ఆ పనులు నత్తనడకన సాగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) రంగంలోకి దిగింది. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 18 నెలల కాలంలో సీఎం శంకుస్థాపన చేసిన పనుల తాజా పరిస్థితిపై వెంటనే నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్లను, సంబంధిత శాఖల అధికారులను సీఎంవో ఆదేశించింది. 

చాలా చోట్ల స్లోగా..!

సీఎం వివిధ జిల్లాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులు నెమ్మదిగా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై సీఎంవోకు ఫిర్యాదులు వచ్చాయి. ఉదాహరణకు.. నారాయణపేట జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో అభివృద్ధి పనులపై సీఎం ప్రత్యేక దృష్టిపెట్టారు. 2024 ఫిబ్రవరిలో ఇక్కడ పర్యటించిన సీఎం రేవంత్​రెడ్డి..కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల సమగ్రాభివృద్ధికి సంబంధించిన  రూ. 4,369 కోట్ల  అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో కొడంగల్‌‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొత్త బస్ డిపో, రోడ్ల విస్తరణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పన తదితర వర్క్స్​ ఉన్నాయి. 

ఈ పనులకు టెండర్ల ప్రక్రియ, భూసేకరణ వంటి అంశాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నట్లు తెలిసింది. ఇక, ఆదిలాబాద్​లో దశాబ్దాలుగా మూతపడి ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) యూనిట్‌‌ను పునరుద్ధరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి 2024 మార్చి 5న మంత్రులు, అధికారులతో కలిసి సీసీఐ స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించి, పునరుద్ధరణ పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చల దశలోనే ఉన్నాయి. ఇక, హైదరాబాద్​ సిటీ అభివృద్ధిలో భాగంగా పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుకు  2024  మార్చిలో సీఎం శంకుస్థాపన చేశారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌‌నుమా వరకు చేపట్టే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, మార్కింగ్ పనులు స్లోగా సాగుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. 

ఇక కరీంనగర్ పట్టణ అభివృద్ధికి సంబంధించి మానేరు రివర్ ఫ్రంట్​ పనులను కొత్త హంగులతో,  పారదర్శకంగా పూర్తి చేస్తామని ఆ మధ్య సీఎం ప్రకటించారు. కేబుల్ బ్రిడ్జి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షలు జరిగాయి.. కానీ, పనుల కేటాయింపు, డిజైన్ల ఖరారు వంటి కీలక ప్రక్రియలు ఇంకా పూర్తి కాలేదు. ఆలేరు నియోజకవర్గంలో మొత్తం రూ. 1,051.45 కోట్ల విలువైన అనేక అభివృద్ధి పనులకు రెండు నెలల కింద శంకుస్థాపనలు చేశారు. 

వీటికి పేపర్​ వర్క్​ కూడా మొదలు కాలేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో గడిచిన ఫిబ్రవరిలో  పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాల, హాస్టల్​, ప్రభుత్వ నర్సింగ్​ కాలేజీ, 100 పడకల ఆసుపత్రి యూనిట్​, రోడ్లు మౌళిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలకు సైతం శంకుస్థాపన చేశారు. ఈ పనుల్లో 10 శాతమే పురోగతి ఉన్నట్లు  సీఎంవో దృష్టికి వచ్చింది. 

నిర్లక్ష్యంపై సీరియస్​

సీఎం శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా చాలా చోట్ల పనులు ప్రారంభం కాకపోవడంపై, ప్రారంభమైన చోట నెమ్మదిగా సాగుతుండటంపై సీఎంవో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. టెండర్ల ఖరారులో జాప్యం, శాఖల మధ్య సమన్వయ లోపం వంటి కారణాలతో పనులను ముందుకు నడిపించడంలో అధికారులు వెనుకడుగు వేస్తున్నారని సీఎంవో గుర్తించింది. ఈ నేపథ్యంలో.. శంకుస్థాపన చేసిన ప్రతి పని ప్రస్తుత స్థితి, టెండర్ల ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయి  అనే వివరాలతో కూడిన ‘లేటెస్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్​’ను వెంటనే సమర్పించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను, హెచ్‌‌వోడీలను సీఎంవో ఆదేశించింది. 

కేవలం శంకుస్థాపనలే కాకుండా, సీఎం తన పర్యటనల్లో స్థానికంగా ఇచ్చిన హామీల అమలుపై కూడా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ రిపోర్టుల ఆధారంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రతిష్టతో ముడిపడి ఉన్న ఈ అభివృద్ధి పనుల విషయంలో జాప్యాన్ని సహించేది లేదని సీఎంవో స్పష్టం చేసినట్లు తెలిసింది.