మిర్యాలగూడలో నత్తనడకన సీఎంఆర్ ప్రక్రియ

మిర్యాలగూడలో నత్తనడకన సీఎంఆర్ ప్రక్రియ
  • బియ్యం అప్పగించేందుకు ఈ నెల 31 వరకు గడువు
  • ఇప్పటి వరకూ 60 శాతం పూర్తయిన మిల్లింగ్..
  • 40 శాతం వరకు ఇంకా పెండింగ్​లోనే..
  • పీడీఎస్​ రైస్​ రీ సైక్లింగ్ చేసి ఇస్తున్నారని ఆరోపణలు  

మిర్యాలగూడ, వెలుగు : ప్రభుత్వం రైస్​ మిల్లర్లకు అప్పగించిన సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్​) ప్రక్రియ జిల్లాలోని పలు ​మిల్లుల్లో నత్తనడకన సాగుతోంది. ​ సీఎంఆర్​ను ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ నెల 31 వరకు గడువు విధించగా.. ఇంకా 40 శాతం వరకూ మిల్లింగ్​ పెండింగ్​లోనే ఉందని అధికారుల లెక్కలు చెప్తున్నాయి. అయితే సీఎంఆర్ ను అప్పగించడంలో  ఏటా మిల్లర్లు ఆలస్యం చేయడం కామనే అయినా.. ఆఖరిలో హడావిడిగా పీడీఎస్ ​రైస్​ రీసైక్లింగ్ ​చేసి ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.  సంబంధిత ఆఫీసర్ల పర్యవేక్షణా లోపమే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఖరీఫ్​ సీజన్​లో మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, నల్గొండ, చిట్యాల, నకిరేకల్, నార్కట్​పల్లి సహా 130 రైస్​ మిల్లులకు 4,53,248 మెట్రిక్​ టన్నుల ధాన్యం తరలించారు. కాగా ఇందుకు ప్రభుత్వానికి క్వింటాళ్లకు 67 కేజీల చొప్పున 3,03676  మెట్రిక్​ టన్నుల సీఎంఆర్ (కస్టం మిల్లింగ్​ రైస్​) అప్పగించాల్సి ఉంది. అయితే ఇందులో సెప్టెంబర్​ 27 నాటికి  2.44 లక్షల మెట్రిక్​ టన్నులు ఇవ్వగా 19.6 శాతం  59,241 మెట్రిక్​ టన్నుల రైస్​ బ్యాలెన్స్​ ఉందని ఆఫీసర్లు తెలిపారు. ధాన్యం తీసుకున్న రైస్​ మిల్లుల్లో 59 శాతం అంటే 76 మిల్లులు  సీఎంఆర్​ ను కంప్లీట్​ చేయగా 54 మిల్లుల్లో పెండింగ్​ ఉంది.

ఎఫ్​సీఐ రిజెక్ట్​..

కొన్ని నెలలుగా బియ్యం నిల్వ చేసి ఉంటుండటంతో   సీఎంఆర్​ ను ఎఫ్​సీఐ రిజెక్ట్​ చేస్తోందని మిల్లర్లు సివిల్​సప్లై ఆఫీసర్లు చెబుతున్నారు. కాగా ఎఫ్​సీఐ రూల్స్​కు అనుగుణంగా మిల్లర్లే  రైస్​ అప్పగించకపోవటం.. తగిన రైస్ నిల్వలు లేకపోవటం వల్లే సీఎంఆర్ ఆలస్యం జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి.  

పీడీఎస్​ రీసైక్లింగ్​ చేస్తున్నారని ఆరోపణలు

జిల్లా వ్యాప్తంగా 991 రేషన్​ షాపులు ఉండగా 4,67,354 ఫుడ్​ సెక్యూరిటీ కార్డులు ఉన్నాయి.  90 శాతం రేషన్ బియ్యం​ వివిధ రూపాల్లో లబ్ధిదారులు, డీలర్ల ద్వారా బ్లాక్​ మార్కెట్​కు తరలిస్తున్న సంగతి ఇటీవల రేషన్​ బియ్యం పట్టుబడుతున్న తీరును చూస్తే తెలుస్తోంది. అయితే  కొంత మంది రైస్​ మిల్లర్లు పీడీఎస్​ బియ్యం కొనుగోలు చేసి ప్రభుత్వానికి సీఎంఆర్ రూపంలో అప్పగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మిల్లింగ్​ చార్జీలు మిగలటంతో పాటు ప్రభుత్వం నుంచి మిల్లింగ్​ చేసినందుకు వచ్చే డబ్బు, తక్కువ రేటులో  పీడీఎస్​ బియ్యం వస్తుండడంతో ఈ తరహా దందాకు తెర తీసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

సీఎంఆర్​ ప్రక్రియను స్పీడప్​ చేస్తం

2021– 22 ఖరీఫ్​, రబీ సీజన్లకు సంబంధించిన సీఎంఆర్​ ప్రక్రియను స్పీడప్​చేస్తం. సీఎంఆర్​ ప్రక్రియలో నల్గొండ రాష్ర్టంలో మెరుగైన స్థానంలో ఉంది. సీఎంఆర్ ప్రక్రియపై జిల్లా సివిల్ సప్లై శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు.  గడువు లోగా  సీఎంఆర్​అప్పగించేందుకు చర్యలు తీసుకుంటాం.

– రామకృష్ణారెడ్డి, సివిల్​సప్లై డీటీ, మిర్యాలగూడ