- బాధితులు వెళ్లి అడిగితే దురుసుగా సమాధానం
- ఆఫీసు చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు
ఘట్‌కేసర్, వెలుగు: ‘ మీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎవరికో ఇచ్చేశాం.. వారి పేరు మాకు తెలియదు.. చెక్కులు తీసుకున్నవారి పేరు రిజిస్టర్ లో నమోదు చేయలేదు.. ఇక మీ చెక్కులు పోయినట్టే.. చెక్కులు మేమేమైనా తయారు చేసివ్వాలా ?.. మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ’’ అంటూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసం వెళ్లిన లబ్ధిదారుడితో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పీఏ, క్యాంప్ ఆఫీసు సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. ఘట్‌కేసర్ సర్కిల్ అంకుషాపూర్ కు చెందిన అంగన్ వాడీ టీచర్ బాలమణి అనారోగ్యంతో కొద్దిరోజుల కింద దవాఖానలో చేరగా.. రెండు మేజర్ సర్జరీలు అయ్యాయి.
రూ.3 లక్షలకుపైగా ఖర్చయింది. అప్పులు తెచ్చి ఆస్పత్రి బిల్లులు కట్టింది. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం గత జూన్ 17న ఘట్‌కేసర్ లోని మేడ్చల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో దరఖాస్తు చేశారు. గత సెప్టెంబర్ 5న రెండు చెక్కులు విడుదలైనట్లు మెసేజ్ రావడంతో బాధితులు సంతోషపడ్డారు. వారం రోజుల్లో చేతికి రావాల్సిన చెక్కులు 3 నెలలు గడిచినా రాలేదు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు ఫోన్ చేస్తే ‘ ఇక్కడికే వస్తాయి.. రాగానే మీకు తెలియజేస్తాం’ అంటూ 2 నెలలు కాలయాపన చేశారు.
చివరకు ‘ బోయిన్ పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు వెళ్లండి’ అని పంపారు. దీనిపై ఎమ్మెల్యే మల్లారెడ్డి పీఏను ఫోన్ లో సంప్రదించగా.. నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని బాధితులు వాపోయారు. సెక్రటేరియేట్‌కు వెళ్లి అడిగితే.. ఎమ్మెల్యే ఆఫీసుకు చెక్కులు పంపిస్తామని చెప్పారని పేర్కొన్నారు. మరోసారి ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు సిబ్బందిని ఫోన్లో సంప్రదించగా దురుసుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
