15న కో ఆపరేటివ్​ ఎన్నికలు

15న కో ఆపరేటివ్​ ఎన్నికలు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో మరో ఎన్నికలకు నగారా మోగింది. వచ్చే నెల 15న సహకార సంఘాల ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు కౌంటింగ్​జరగనుంది. ఈ మేరకు గురువారం స్టేట్‌‌ కోఆపరేటివ్‌‌ ఎలక్షన్‌‌ అథారిటీ ఎన్నికల నోటిఫికేషన్‌‌ రిలీజ్​ చేసింది. రాష్ట్రంలోని 906 ప్రైమరీ అగ్రికల్చరల్ కోఅపరేటివ్ క్రెడిట్ సొసైటీ(పీఏసీఎస్)లకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు అడిషనల్‌‌ రిజిస్ట్రార్‌‌ నోటిఫికేషన్‌‌లో స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తయిన మూడు రోజుల్లోగా సొసైటీ చైర్మన్, వైస్​ చైర్మన్లను​ఎన్నుకుంటారు. డీసీసీబీ ఎన్నికకు సంబంధించి ప్రత్యేక ఎన్నికల షెడ్యూల్​ విడుదల చేస్తారు. పీఏసీఎస్​ చైర్మన్​లు అందరు కలిసి డీసీసీబీ చైర్మన్, వైస్​ చైర్మన్​ను ఎన్నుకుంటారు. పాత సహకార సంఘాలకే ఎన్నికలు నిర్వహించనున్నారు. డీసీసీబీలు కూడా ఉమ్మడి జిల్లాలకే ఎలక్షన్లు జరగనున్నాయి.

రెండేండ్లుగా ఇన్​చార్జ్​ల పాలనే..

రాష్ట్రవ్యాప్తంగా 906 పీఏసీఎస్​లు ఉన్నాయి. ఒక్కో సొసైటీ పరిధిలో 13 వార్డుల వరకు ఉంటాయి. పీఏసీఎస్​ల కాలపరిమితి ముగిసి రెండేండ్లు అవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013 జనవరిలో సహకార ఎన్నికలు జరిగాయి. 2017 డిసెంబర్​నాటికి పాలకవర్గాల గడువు ముగిసింది. అప్పటి నుంచి అవి ఇన్‌‌చార్జ్​ల పాలనలోనే కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి ఇన్‌‌చార్జ్​ల పాలనను పొడిగిస్తోంది. ప్రస్తుత టర్మ్‌‌ ఫిబ్రవరి 5తో ముగుస్తుంది. దీంతో సహకార ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 2018 డిసెంబర్​31 నాటికి సొసైటీల్లో సభ్యత్వం కలిగిన వారికే ఓటు హక్కు కల్పించారు. దీంతో 906 సొసైటీల్లో 18,42,412 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. సొసైటీలో ఎవరైనా సభ్యత్వం పొందొచ్చు. కానీ సభ్యత్వం పొంది ఏడాది దాటిన వారికే ఓటు హక్కు లభిస్తుంది. అది కూడా వాటాధనం రూ.300 చెల్లించాలి. సొసైటీకి ఎలాంటి బాకీలు ఉండరాదు. హైదరాబాద్‌‌ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో డీసీసీబీలు కొనసాగుతున్నాయి. కొత్త జిల్లా కేంద్రాల్లో డీసీసీబీలను ఏర్పాటు చేస్తామని సర్కారు చెప్పినా ఆచరణకు నోచుకోలేదు. కొత్తగా మరో 453 పీఏసీఎస్​లు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చినా ఆ తర్వాత వెనక్కి తగ్గింది.