రాష్ట్రవ్యాప్తంగా 747 పీఏసీఎస్‌లకు పోలింగ్
157 పీఎసీఎస్‌లు, 5,402 డైరెక్టర్ పదవులు ఏకగ్రీవం
6,248 డైరెక్టర్ పోస్టులకు 14,530 మంది పోటీ
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్
వెంటనే లెక్కింపు.. రిజల్ట్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)కు శనివారం ఎలక్షన్లు జరుగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 904 పీఏసీఎస్‌లు ఉండగా.. 157 ఏకగ్రీవమయ్యాయి. మిగతా 747 సంఘాలకు పోలింగ్ జరగనుంది. ఏకగ్రీవం కాగా మిగిలిన 6,248 డైరెక్టర్ పదవులకోసం 14,529 మంది క్యాండిడేట్లు పోటీలో ఉన్నారు. ఒక్కో డైరెక్టర్ పదవికి సంబంధించి ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ముగ్గురు ఎన్నికల సిబ్బంది ఉంటారని, ఈ మేరకు 20 వేల మందికి శిక్షణ ఇచ్చామని సహకార శాఖ వర్గాలు వెల్లడించాయి.
వెంటనే కౌంటింగ్.. రిజల్ట్స్
శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. 904 ప్యాక్స్‌ల పరిధిలో 11,653 డైరెక్టర్ స్థానాలకు నోటిఫికేషన్ జారీచేయగా.. అందులో ఏకంగా 5,402 స్థానాలు (46 శాతం) ఏకగ్రీవమయ్యాయి. వాటన్నింటినీ అధికార పార్టీ మద్దతుదారులే కైవసం చేసుకున్నారు. మిగతా వాటిలో పోటీ జరుగుతోంది. ఆదివారం ఉదయం పీఎసీఎస్‌ల పాలకమండళ్లు కొలువుదీరనున్నాయి.
