ఇంజిన్ ముందుకు.. భోగీలు వెనక్కి: గంగా సట్లెజ్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

ఇంజిన్ ముందుకు.. భోగీలు వెనక్కి: గంగా సట్లెజ్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

దేశంలో రైలు ప్రయాణం చేయాలంటేనే జంకాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అఖండ భారతదేశంలో రోజుకోచోట ఏదో ఒక ప్రమాదం వెలుగుచూస్తూనే ఉన్నాయి. బడ్జెట్‌లో వేల కోట్ల రూపాయలు వెచ్చించి 'కవచ్ వ్యవస్థ' వంటి అత్యాధునిక సాంకేతికను అందుబాటులోకి తెచ్చిన ఒరిగిందేమీ లేదు. గతేడాది ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన కాంచనగంగ రైలు ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో చిన్నా చితక రైలు ప్రమాదాలు కోకొల్లలు.

బోగీలు విడిపోయాయి

ఆదివారం(ఆగష్టు 25) తెల్లవారుజామున ధన్‌బాద్ వెళ్తున్న గంగా సట్లెజ్ ఎక్స్‌ప్రెస్ రైలులో కొన్ని బోగీలు విడపోయాయి. సియోహరా రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉదయం 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్య కారణంగా ఇంజన్ నుండి బోగీలు విడిపోయాయని అదనపు పోలీసు సూపరింటెండెంట్ ధరమ్ సింగ్ మార్చాల్ వెల్లడించారు. రైల్వే సిబ్బంది సమస్యను పరిష్కరిస్తున్నారని, త్వరలో ధన్‌బాద్‌కు రైలు ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తుందని ఆయన అన్నారు. ఈ ఘటనలో ప్రయాణీకులెవరూ గాయపడలేదని ఉన్నతాధికారులు తెలిపారు. ఇంజిన్ నుండి భోగీలు విడిపోయిన అనంతరం రైలు కొంత దూరం ప్రయాణించినట్లు నెట్టింట వీడియోలు వైరల్ అవుతున్నాయి.

వెనుక రైలు వస్తే.. 

బోగీలు విడపోయిన సమయంలో అదే ట్రాక్ పై వెనుక మరొక ట్రైన్ వస్తే పరిస్థితి ఏంటనేది ప్రయాణికుల ప్రశ్న. ఎన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా అధికారులు అప్రమత్తంగా ఉండట్లేరని వారు వాపోతున్నారు.

సట్లెజ్ ఎక్స్‌ప్రెస్ అనేది నార్త్ రైల్వే జోన్‌కి చెందిన ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్, చండీగఢ్ జంక్షన్ మధ్య నడుస్తుంది. గతంలో ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్, లూథియానా జంక్షన్ మధ్య నడుస్తుండగా.. తరువాత చండీగఢ్ జంక్షన్ వరకు విస్తరించారు.