అడ్డగోలు ఫీజులు.. ఒక్కో క్లాసులో వందల మంది

అడ్డగోలు ఫీజులు.. ఒక్కో క్లాసులో వందల మంది


ఫంక్షన్​ హాళ్లలో సెంటర్లు.. కనీస సౌలతులు కరువు
స్టడీ మెటీరియల్ రేట్లు, హాస్టల్ ​రెంట్లూ పెంచేసిన్రు
గడిచిన 15 రోజుల్లోనే రూ. వంద కోట్ల వ్యాపారం
ఈ సీజన్ లో 400 కోట్ల బిజినెస్​ నడుస్తుందని అంచనా
ఫీజుల కంట్రోల్​ను పట్టించుకోని రాష్ట్ర సర్కార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కోచింగ్, స్టడీ మెటీరియల్ బిజినెస్​ జోరందుకుంది. కరోనాతోపాటు ఇన్నాళ్లూ ఎలాంటి జాబ్​ నోటిఫికేషన్లు లేక మూతపడిన కోచింగ్​ సెంటర్లు.. కొలువులకు నోటిఫికేషన్లు ఇస్తామన్న సర్కార్​ హామీతో కిటకిటలాడుతున్నాయి. వాటికి ఫుల్​ గిరాకీ నడుస్తున్నది. అడ్మిషన్లకు ఉన్న డిమాండ్​ ను ఆసరా చేసుకుని పలు కోచింగ్​ ఇన్​స్టిట్యూట్లు గ్రూప్స్​, టెట్​, టీఆర్టీ, ఎస్సై, కానిస్టేబుల్​ జాబ్స్​ కు సంబంధించిన కోచింగ్ ఫీజులను డబుల్ చేశాయి. ఇన్నాళ్లూ కోల్పోయిన ఆదాయాన్ని ఇప్పుడు రాబట్టే పనిలోపడ్డాయి. ఫీజు విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేందుకు అవసరమైన స్టడీ మెటీరియల్ ధరలను పబ్లిషర్స్​ అమాంతం పెంచేశారు. గతంతో పోలిస్తే పుస్తకాల ధరలు 40 శాతం నుంచి 60 శాతానికి పెరిగాయి. ఇంకోవైపు కోచింగ్​సెంటర్లు అధికంగా ఉన్న హైదరాబాద్​లోని అశోక్​నగర్​, విద్యానగర్, నారాయణగూడ, దిల్ సుఖ్​ నగర్, చైతన్యపురి ఏరియాల్లోని బాయ్స్​, గర్ల్స్ హాస్టళ్లు, రెంటెడ్​ రూమ్ లకు ఫుల్​ డిమాండ్​ పెరిగింది.
గ్రూప్ - 1కు  60 వేలు
గ్రూప్ - 2కు 25 వేలు
టెట్​కు 15,000 వేలు
ఎస్సై, కానిస్టేబుల్ 15,000 వేలు

హనుమకొండ, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్​ లాంటి నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కోచింగ్ తీసుకునే ఒక్కో అభ్యర్థి తక్కువలో తక్కువ రూ. 40 వేల నుంచి లక్షన్నర వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. గడిచిన 15 రోజుల్లో కోచింగ్, స్టడీ మెటీరియల్​ బిజినెస్​ కలిపి సుమారు రూ. 100 కోట్లు దాటిందని అంచనా. ఈ సీజన్ లో రూ. 400 కోట్ల బిజినెస్​ నడువొచ్చని ప్రముఖ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు ఒకరు చెప్పారు.  

ఒక్కో పోస్టుకు ఒక్కో లెక్క

హైదరాబాద్​తోపాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో గ్రూప్స్​ కు సంబంధించిన ప్రైవేట్​ కోచింగ్ సెంటర్లు 30 వరకు ఉండగా.. టెట్, టీఆర్టీ కోచింగ్ సెంటర్లు 100, ఎస్సై, కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్లు 50 వరకు ఉన్నాయి. వివిధ ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల తాకిడి ఊహించినదానికంటే ఎక్కువగా ఉండడంతో ఆయా కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఫీజులు పెంచేశారు. హైదరాబాద్ అశోక్​నగర్ లో పేరున్న రెండు కోచింగ్ సెంటర్లు గతంలో  గ్రూప్ –1కు రూ.30 వేల ఫీజు వసూలు చేయగా..  ఇప్పుడు రూ. 60 వేలకు పెంచాయి. గ్రూప్ – 2కు ఒక్కొక్కరికి గతంలో రూ. 15 వేలు తీసుకోగా ఇప్పుడు రూ. 25 వేలు వసూలు చేస్తున్నాయి. సింగిల్​ సబ్జెక్టుకు కోచింగ్ తీసుకోవాలనుకుంటే రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. మిగతా కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కూడా కొంత తేడాతో ఇదే ఫీజు స్ట్రక్చర్ ను ఫాలో అవుతున్నారు. దిల్ సుఖ్​నగర్​లో  ఎక్కువగా ఉన్న టెట్, టీఆర్టీ కోచింగ్​ సెంటర్లలో టెట్​ కోచింగ్‌కు రూ. 10 వేల నుంచి రూ. 15 వేల చొప్పున ఫీజు వసూలు చేస్తున్నారు. టెట్​, టీఆర్టీ కలిపి దాదాపు రూ. 25 వేల దాకా తీసుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఈ ఫీజులు డబుల్​ అయ్యాయి. ఇదే ఏరియాలో ఎక్కువగా ఉండే ఎస్సై, కానిస్టేబుల్​ కోచింగ్ సెంటర్లలో ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 10 వేల నుంచి 15 వేల వరకు తీసుకుంటున్నారు. 

పుస్తకాల రేట్లకు రెక్కలు

కోచింగ్ తీసుకున్నా, తీసుకోకపోయినా ఉద్యోగ పరీక్షలకు స్టడీ మెటీరియల్ తప్పనిసరి కావడంతో అభ్యర్థులు అందుక్కావాల్సిన పుస్తకాలన్నీ కొనుగోలు చేస్తున్నారు. విజయవాడ, హైదరాబాద్​ కు చెందిన వివిధ ప్రైవేట్​ ప్రచురణ సంస్థలు గతంలో మిగిలిపోయిన పాత పుస్తకాలకు పైన కవర్​ పేజీలు మార్చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. తెలుగు అకాడమీ బుక్స్​ ఇంకా మార్కెట్​ లోకి అందుబాటులోకి రాకపోవడం, పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్​ పెద్దగా మారకపోవడం వారికి కలిసివచ్చింది. పుస్తకాల రేట్లను డబుల్ చేశారు. రేట్ల విషయంలో సర్కార్ నుంచి ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ప్రైవేట్​ పబ్లిషర్లు పెట్టిందే రేటుగా చలామణీ అవుతున్నది. కొన్ని పబ్లికేషన్ల ఓనర్లు ప్రాంతాలవారీగా ఫ్రాంచైజీలను కూడా ఏర్పాటు చేశారు. ప్రముఖ బుక్‌‌‌‌‌‌‌‌ షాప్‌‌‌‌‌‌‌‌ల్లో, కోచింగ్​ సెంటర్లలో తమ పుస్తకాలను మాత్రమే అమ్మేలా ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. అలాగే కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు తమ ఇన్​స్టిట్యూట్, తమ దగ్గర క్లాసులు చెప్పే లెక్చరర్ల పేరిట స్టడీ మెటీరియల్ ప్రింట్ చేసి అమ్ముతున్నారు. ఐదు, పదేండ్ల కింద ప్రింట్​ చేసిన పుస్తకాలను రీప్రింట్​ చేస్తున్నారు. గతంలో డిస్కౌంట్​తో  రూ.400కు లభించిన పుస్తకం ఇప్పుడు 750కి అమ్ముతున్నారు. కోచింగ్‌తో పాటు పుస్తకాల సేల్స్​ తో సెంటర్ల వాళ్లు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. 

ఆన్​లైన్​ కోచింగ్ కూ ఫుల్ డిమాండ్​

హైదరాబాద్ తోపాటు ఇతర నగరాలకు వెళ్లి హాస్టళ్లలో ఉంటూ చదువుకోలేని చాలా మంది నిరుద్యోగులు ఇంటి దగ్గరే ఉంటూ కాంపిటీటివ్​ ఎగ్జామ్స్​ కు ప్రిపేర్ అయ్యేందుకు ఇంట్రెస్ట్​ చూపుతున్నారు. హైదరాబాద్​ లాంటి మహానగరాల్లో కోచింగ్ చాలా కాస్ట్లీగా మారడం, రూమ్ రెంట్స్​, హాస్టల్​ ఫీజులు తడిసి మోపెడవుతుండడంతో ఉన్న చోటు నుంచే యాప్​ బేస్డ్ ఆన్​ లైన్ పాఠాలు వినేందుకు మొగ్గు చూపుతున్నారు.  హైదరాబాద్​, వరంగల్​ తదితర నగరాల్లో ప్రసిద్ధి చెందిన ఇన్​స్టిట్యూట్లలో ఎక్స్ పర్ట్స్​ చెప్పే పాఠాలను యాప్​ సాయంతో ఇంటి దగ్గరి నుంచి వింటున్నారు. ఆన్ లైన్ కోచింగ్ కు సబ్జెక్ట్ ను బట్టి ఆయా సెంటర్లు ఏడాది డ్యురేషన్​ తో రూ. 2 వేల నుంచి రూ. 10 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. ఆన్​ లైన్​ లో ఎప్పుడైనా వినేలా వీడియో పాఠాలను, ఎప్పుడైనా చదువుకునేలా పీడీఎఫ్ రూపంలో స్టడీ మెటీరియల్​ను అందుబాటులో ఉంచుతున్నాయి.

పెరిగిన హాస్టల్ ఫీజులు, రూమ్​ రెంట్స్​  

 కోచింగ్​ సెంటర్లు ఎక్కువగా ఉన్న.. హైదరాబాద్​లోని అశోక్‌‌‌‌‌‌‌‌నగర్, విద్యానగర్​, హిమాయత్‌‌‌‌‌‌‌‌నగర్, అమీర్‌‌‌‌‌‌‌‌పేట, పంజాగుట్ట, ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ నగర్, కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, దిల్‌‌‌‌‌‌‌‌సుఖ్‌‌‌‌‌‌‌‌ నగర్ సహా వాటి పరిసర ప్రాంతాల్లోని హాస్టళ్లకు డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా ఉంది. కొన్ని హాస్టళ్లలో కెపాసిటీకి మించి బెడ్స్ అరెంజ్​ చేస్తున్నారు. హాస్టల్​లో ఉండాలంటే నెలకు మినిమమ్​ రూ.4 వేల నుంచి 5 వేలు కట్టాల్సి వస్తున్నది. ఇద్దరు, ముగ్గురు కలిసి రూమ్ రెంట్ కు తీసుకున్నా ఒక్కొక్కరిపై రూ. 3 వేల నుంచి రూ.4 వేల భారం పడుతున్నది. కోచింగ్​ సెంటర్ల ఏరియాల్లోని ఇండ్లలో మొన్నటి వరకు సింగిల్​ బెడ్రూమ్​కు నెలకు రూ.7 వేల అద్దె ఉండగా.. ప్రస్తుతం 10 వేల వరకు పెంచేశారు.  కోచింగ్​సెంటర్లకు కిలోమీటర్  దూరం వరకు ఇంటి కిరాయిలు ఇలాగే ఉంటున్నాయి.  

ఫీజు డబుల్ చేశారు

నేను బీటెక్ చేసి, ప్రస్తుతం గ్రూప్స్ ఎగ్జామ్స్​కు ప్రిపేర్ అవుతున్న. కోచింగ్ తీసుకుంటే ప్రిపరేషన్ ఈజీ గా ఉంటుందని హైదరాబాద్​లో ఓ ఇన్​స్టిట్యూట్ కు వెళ్తే  
గ్రూప్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌–2 అయితే రూ. 30 వేల దాకా.. గ్రూప్ –1 అయితే 
రూ. 50 వేలకు పైనే ఫీజు చెప్తున్నారు. కరోనా రాక ముందుతో పోలిస్తే ఇప్పుడు ఫీజులు డబుల్ చేశారు. 
- జి. సుమన్, సూర్యాపేట 

తెలుగు అకాడమీ బుక్స్​ దొరుకుతలేవు

నేను గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న. తెలుగు అకాడమీ లో అన్ని బుక్స్ అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రైవేట్​ పబ్లికేషన్స్ పుస్తకాలు కొనాల్సి వస్తున్నది. బుక్స్ రేట్లు భారీగా పెంచారు. కేవలం గ్రూప్ 2 బుక్స్ కోసమే రూ. 3 వేల నుంచి 4 వేలు ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. వీలైనంత తొందరగా అకాడమీ నుంచి అన్ని రకాల పోటీ పరీక్షల బుక్స్ అందుబాటులోకి తీసుకురావాలి. 
- వంశీ, ఖమ్మం