- ఐక్యంగా పోరాడి దామాషా మేరకు సాధించుకోవాలి
- పార్లమెంటు వద్ద రాష్ట్ర బీజేపీ నేతలు నిరసనలు తెలపాలి
- ప్రొఫెసర్ కోదండరాం
సూర్యాపేట, వెలుగు: సామాజిక తెలంగాణ నిర్మాణంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు కీలక అడుగు పడిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నో త్యాగాలతో సాధించుకున్న స్వరాష్ట్రం ఆధిపత్య వర్గాలకు అధికార బదలాయింపు కొరకు కాదన్నారు. ప్రజలందరికీ భాగస్వామ్యం కల్పించడానికి సాధించుకున్నామని, ఆ దిశగా అడుగులు వేయడమే తెలంగాణ ప్రజల ప్రధాన కర్తవ్యం అని అన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ జనసమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ‘ సామాజిక తెలంగాణ – బీసీ రిజర్వేషన్లు – ప్రాతినిథ్య ప్రజాస్వామ్యం’పై జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ తొలి నుంచి కులగణనకు వ్యతిరేకమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయడం హర్షించదగిన విషయమన్నారు. ఐక్యంగా పోరాడి జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లను సాధించుకోవాలన్నారు.
ప్రజలకు ఉచిత పథకాలు కాదని సమానత్వం, ఆత్మగౌరవం ముఖ్యమన్నారు. రిజర్వేషన్లను సవరించుకోవచ్చని మండల్ కమిషన్ రిపోర్టులోనే ఉందని గుర్తుచేశారు. రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చి న్యాయ సమీక్ష నుంచి రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందని, ఉన్న రిజర్వేషన్లను కూడా తగ్గించారని విమర్శించారు. ఈనెలలో జిల్లాల వారీగా సదస్సులు, సెమినార్లు నిర్వహించి ప్రజల్లో చైతన్యం చేస్తామన్నారు.
డిసెంబర్‌లో హైదరాబాద్‌లో భారీ ర్యాలీ, జనవరిలో ఢిల్లీలో దీక్షలు, ధర్నాలు నిర్వహిస్తామన్నారు. బీజేపీ నేతలు ఇక్కడ మద్దతు తెలపడం కాదని, ఢిల్లీలో పార్టీ వైఖరేంటో చెప్పేందుకు ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లు కోసం కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ మెట్ల మీద నిరసన చేశారని, అదే తరహాలో నేడు బీజేపీ ఎంపీలు ఢిల్లీలో పోరాటం చేయాలన్నారు.
యువజన సమితి నేత నారబోయిన కిరణ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్, జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు నాగరాజు గౌడ్, బీసీ జేఏసీ కన్వీనర్ చల్లమల్ల నర్సింహా, లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు వీరేశ్నాయక్, విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని వినయ్ గౌడ్, జిల్లా నేతలు పాల్గొన్నారు. అనంతరం సదస్సులో పలు తీర్మానాలు ఆమోదించారు.
