ఐరన్ మ్యాన్ టైటిల్ విజేత నిర్మల్ డాక్టర్

ఐరన్ మ్యాన్ టైటిల్ విజేత నిర్మల్ డాక్టర్
  • గోవాలో జరిగిన పోటీల్లో అరుదైన ఘనత సాధించిన నరసింహారెడ్డి
  • 64 దేశాల నుంచి 1,300కు పైగా పోటీదారులపై విజేతగా నిలిచాడు 

నిర్మల్, వెలుగు: అంతర్జాతీయ ఐరన్ మ్యాన్ టైటిల్ పోటీల్లో నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బీఎల్ నరసింహారెడ్డి విజేతగా నిలిచారు. గోవాలో ఆదివారం జరిగిన  ఈ పోటీల్లో 64 దేశాల నుంచి 1300కు పైగా అభ్యర్థులు పాల్గొన్నారు.  నరసింహారెడ్డి  8 గంటల వ్యవధిలోనే 70.3 మైళ్ల లక్ష్యం చేరుకుని  టైటిల్ గెలుచుకుని  తెలంగాణ కీర్తిని చాటారు. 

 ఈ పోటీల్లో  భాగంగా అరేబియా సముద్రంలో 1.9 కిలోమీటర్ల ఈతను గంట పది నిమిషాలకుగాను.. 2 కిలోమీటర్ల టార్గెట్ చేశారు. అదేవిధంగా 3.45 గంటల్లో 90 కిలోమీటర్ల సైక్లింగ్, 2.45 గంటల్లో 21 కిలోమీటర్ల రన్నింగ్ లోనూ ఆయన విజయం సాధించి  టైటిల్ సొంతం చేసుకున్నారు. రాష్ట్రం నుంచి తొమ్మిది మంది పాల్గొనగా నరసింహారెడ్డి ఒక్కరే ఇలాంటి అరుదైన ఘనతను సాధించారు.  నిర్మల్ సైకిల్ క్లబ్ ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు. 

ఇప్పటికే పలు దేశాల్లో నిర్వహించిన పోటీల్లోనూ పాల్గొన్నారు. గతంలో 200 కిలోమీటర్ల సైకిల్ మారథాన్ లోనూ రికార్డు సాధించారు. ఇప్పుడు 6 నెలలుగా నిర్మల్ తోపాటు పరిసర ప్రాంతాల్లోని చెరువుల్లో ఈత ప్రాక్టీసు చేశానని, సైక్లింగ్ రన్నింగ్ లోనూ నిర్వాహకులు నిర్దేశించిన సమయానికి ముందే పూర్తిచేసినట్లు నరసింహారెడ్డి తెలిపారు.  కఠోర దీక్షతోనే పోటీల్లో సక్సెస్ అయ్యానని, ఐరన్ మ్యాన్ టైటిల్ పొందడం సంతృప్తిగా ఉందని పేర్కొన్నారు. నరసింహారెడ్డిని నిర్మల్ డాక్టర్లతో పాటు స్థానిక ప్రముఖులు జిల్లా వాసులు అభినందించారు.