బోరు వేస్తే బొగ్గు పడింది

బోరు వేస్తే బొగ్గు పడింది

ములుగు జిల్లా గోదావరి తీర ప్రాంతంలో బోరు వేస్తుండగా బొగ్గు నిక్షేపాలు వెలుగుచూశాయి. ఇది తెలుసుకున్న సింగరేణి ఆఫీసర్లు వెళ్లి బొగ్గును పరిశీలించి నమూనాలు తీసుకెళ్లారు. మహదేవపూర్ మండలం సండ్రుపల్లిలో గోదావరి తీరానికి సమీపంలో సురేందర్ అనే రైతు మంగళవారం తన పొలంలో బోరు వేశారు. 35 ఫీట్ల అనంతరం మట్టికి బదులుగా బొగ్గు రావడం మొదలైంది. 300 ఫీట్ల వరకు డ్రిల్‌‌ చేసినా చేసిన బొగ్గే వస్తుండడంతో బోరు వేయడం ఆపేశాడు.
ఈ సమాచారం తెలియడంతో బుధవారం సింగరేణి ఆఫీసర్లు వెళ్లి బోరు వేసిన ఏరియాను పరిశీలించారు. గోదావరిఖని డిప్యూటీ జనరల్ మేనేజర్ పీవీకే అప్పారావు మాట్లాడుతూ అధికారుల ఆదేశాల మేరకు బొగ్గు నిక్షేపాలు బయటపడిన ప్రాంతాన్ని పరిశీలించి, బయటపడిన కొంత బొగ్గును పరీక్షల నిమిత్తం పంపిస్తున్నామని తెలిపారు.

గతంలో ఓఎన్జీసీ, సింగరేణి సర్వే…

గోదావరి నుంచి మణుగూరు వరకు తీర ప్రాంతంలో భారీగా బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు ఓఎన్జీసీ,సింగరేణి  గతంలో సంయుక్త సర్వే నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రిపోర్టు ఇచ్చాయి. 1993-1994 సీనియర్ జియాలజిస్టు కోనప్ప ఆధ్వర్యంలో మహదేవపూర్, అన్నారం, సండ్రుపల్లి ప్రాంతాల్లో అండర్ బావుల ద్వారా బొగ్గు వెలికితీతకు అనుకూలంగా ఉందని బీ, సీ గ్రేడ్ అత్యధికంగా ఉన్నట్టు తేల్చారు. మహదేవపూర్ నుంచి సండ్రుపల్లి వరకు పలు ప్రాంతాల్లో డ్రిల్‌‌ చేసి బొగ్గు బావులు ఏర్పాటు చేసే దశగా ప్రయత్నాలు చేశారు. అప్పటి పీపుల్స్‌‌వార్ నక్సలైట్లు ఓఎన్జీసీకి సంబంధించిన వాహనాన్ని దహనం చేయడంతో ఆ పనులకు బ్రేక్ పడింది. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అప్పటి కార్మిక శాఖ మంత్రి వినోద్ ఈ ప్రాంతలో బొగ్గు గనుల గురించి ప్రయత్నించినా ప్రభుత్వం నుంచి అంతగా స్పందన కనిపించలేదు.