పెళ్లి పేరుతో టీడీపీ నేత కుమారుడి మోసం: పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగిన తల్లి

పెళ్లి పేరుతో టీడీపీ నేత కుమారుడి మోసం: పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగిన తల్లి

అమరావతి: పెళ్లి పేరుతో ఓ యువతిని టీడీపీ నేత కుమారుడు మోసం చేశాడు. దీంతో బాధితురాలి తల్లి పోలీస్ స్టేషన్ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సదరు మహిళను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

వివరాల ప్రకారం.. టీడీపీ నేత పల్లపోతు సుబ్రహ్మణ్యం కొడుకు అభినవ్ ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లాడు. తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో నాలుగు రోజుల తర్వాత యువతిని మచిలీపట్నం తీసుకొచ్చాడు అభినవ్. సదరు యువతిని తన కొడుకు పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని సుబ్రహ్మణ్యం ఎలాగైనా పెళ్లి ఆపడానికి ప్రయత్నించాడు. దీని కోసం కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రిని ఆశ్రయించాడు. రాజీ కుదిర్చేందుకు రంగంలోకి దిగిన మంత్రి.. టీడీపీ నేత కొడుకుని పక్కకు తప్పించేందుకు ప్రయత్నం చేశాడు. 

►ALSO READ | ఏపీ లిక్కర్‌ స్కాంలో వరుణ్ అరెస్ట్.. విదేశాలకు పారిపోతుండగా పట్టుకున్న సిట్

తన కొడుకుకు బలవంతంగా పెళ్లి చేసినా మీ బిడ్డను చంపేస్తామంటూ యువతి కుటుంబ సభ్యులను బెదిరించాడు సుబ్రహ్మణ్యం. దీంతో యువతి తల్లి చిలకలపూడి పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. తన కూతురికి న్యాయం చేయాలని వేడుకుంది. పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేత కావడం, ఓ మంత్రి అండదండలు ఉండటంతో నిందితుడిపై పోలీసులు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.