
- బొగ్గు గనులను శాస్త్రీయ పద్ధతిలో మూసేస్తున్నం: కిషన్రెడ్డి
- కన్హా శాంతివనంలో బొగ్గుశాఖ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం
- హార్ట్‌ఫుల్‌నెస్ సెంటర్‌తో సింగరేణి, కోల్ ఇండియా ఎంవోయూ
హైదరాబాద్, వెలుగు: మూతపడిన బొగ్గు గనులపై అడవులను పెంచనున్నట్టు కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. బొగ్గు ఉత్పత్తితో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అలాగే గనులను శాస్త్రీయ పద్ధతిలో మూసివేయడానికి కార్యచరణ రూపొందించామన్నారు. గురువారం హైదరాబాద్ శివార్లలోని కన్హా శాంతివనంలో బొగ్గు, గనుల శాఖ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గనులు మూసివేసే విధానం, (మైన్ క్లోజర్), ఖనిజాల వెలికితీత (మినరల్ ఎక్స్‌ప్లోరేషన్) తదితర అంశాలపై విస్తృత చర్చించారు.
అనంతరం కన్హా శాంతివనంలోని హార్ట్‌ఫుల్‌నెస్ సెంటర్‌తో కోల్ ఇండియా, సింగరేణి సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సింగరేణి రామగుండంలో గ్రీన్ వాల్ నిర్మాణం కోసం, కోల్ ఇండియా దేశవ్యాప్తంగా గనుల ప్రాంతాల్లో అడవుల పెంపునకు ఒప్పందాలు చేసుకున్నాయి.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆదేశాల మేరకు 143 బొగ్గు గనులను మూసివేసేందుకు నిర్ణయించామని తెలిపారు. ఈ ఏడాది 10 గనుల్లో పనులు మొదలుపెట్టి 7- నుంచి 8 గనులను శాస్త్రీయ పద్ధతుల్లో మూసివేశామని వెల్లడించారు. రానున్న రోజుల్లో మిగిలిన గనులను మూసివేస్తామన్నారు. వాటిని సమాజానికి ఉపయోగపడేలా మారుస్తామని హామీ ఇచ్చారు. హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ స్ఫూర్తితో వృక్షసంపద పెంపొందించేందుకు ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు.
గని కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని మెరుగుపరుస్తూ, ప్రస్తుత ఇన్సూరెన్స్‌తో పాటు అదనంగా ఒక్కొక్కరికి రూ.1 కోటి ఇన్సూరెన్స్ అందిస్తున్నట్లు తెలిపారు. మైనింగ్ లో సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో బొగ్గు శాఖ సహాయమంత్రి సతీశ్ చంద్ర దూబే, కమిటీ సభ్యులైన ఎంపీలు, గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు, కోల్‌ఇండియా చైర్మన్ పీఎం ప్రసాద్, సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌తో పాటు వివిధ పీఎస్‌యూల సీఎండీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.