
- 70 ప్లాంట్లలో తీవ్రంగా కొరత..
- బీహార్, జార్ఖండ్‌లో 7 నుంచి 8 గంటలు పవర్ కట్
- బొగ్గు సరఫరా పెంచాలంటూ కేంద్రానికి రాష్ట్రాల లేఖలు
- యూనిట్ రేట్లు పెంచేసిన పవర్ ఎక్స్చేంజీలు
- కేంద్రం పరిధిలోని 15 శాతం కరెంటు
- వాడుకునేందుకు రాష్ట్రాలకు పవర్ మినిస్ట్రీ పర్మిషన్
- రేటు ఎక్కువ వస్తోందని బయట అమ్ముకోవద్దని వార్నింగ్
- బొగ్గు నిల్వలు, కరెంటు సప్లైపై ప్రధాని మోడీ రివ్యూ
న్యూఢిల్లీ / చెన్నై / బెంగళూరు: రోజురోజుకూ కోల్ క్రైసిస్ ముదురుతోంది. కరెంటు ముప్పు ముంచుకొస్తోంది. పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కరెంటు కోతలు మొదలయ్యాయి. బొగ్గు సరఫరాను పెంచామని కేంద్రం చెప్తున్నా.. అవసరాలకు తగినట్లు అందడం లేదు. దేశంలో 135 థర్మల్ పవర్ స్టేషన్లు ఉండగా.. 115 స్టేషన్లలో బొగ్గు కొరత ఎక్కువగా ఉందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. వాటిలో 70 ప్లాంట్లలో కనీసం నాలుగు రోజులకు సరిపడా బొగ్గు కూడా లేదని వెల్లడిస్తున్నాయి.తమ రాష్ట్రానికి కోల్ సరఫరా చేయాలంటూ రాష్ట్రాలు కేంద్రానికి లెటర్లు రాస్తున్నాయి. పరిస్థితి క్రిటికల్ గా ఉందని ఆందోళన చెందుతున్నాయి. దీంతో స్వయానా ప్రధాని రంగంలోకి దిగారు. బొగ్గు నిల్వలు, కరెంటు సరఫరాపై సోమవారం పవర్, కోల్ మినిస్ట్రీల మంత్రులతో కేంద్ర మంత్రి అమిత్ షా చర్చించగా.. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ రివ్యూ చేశారు. వీలైనంత త్వరగా సంక్షోభాన్ని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ
కోల్ షార్టేజ్ వల్ల పవర్ జనరేషన్ పెరగడం లేదు. దేశంలోని 10కి పైగా రాష్ట్రాల్లో విద్యుత్ లోటు ఏర్పడింది. వారం పది రోజులుగా పంజాబ్, రాజస్తాన్, ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా, బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో కోతలు పెరిగిపోయాయి. బీహార్, ఝార్ఖండ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం రోజుకు 8 నుంచి 7 గంటలకు మించి సరఫరా ఉండడం లేదని నేషనల్ మీడియా చెబుతోంది. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ కరెంటు కోతలు ఉంటున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రాష్ట్రాలు పవర్ ఎక్స్చేంజీల నుంచి అధిక ధరలకు కరెంటు కొంటున్నాయి.
- మహారాష్ట్రలో 3,500 నుంచి 4 వేల మెగా వాట్ల వరకు పవర్ షార్టేజ్ ఉందని ఆ రాష్ట్ర విద్యుత్ మంత్రి నితిన్ రౌత్ చెప్పారు. కోల్ ఇండియాకు ప్లానింగ్ సరైన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. తాము అగ్రిమెంటు కుదుర్చుకున్న పలు కంపెనీలు పవర్ సప్లై చేయడం లేదని చెప్పారు. వాటి దగ్గర కోల్ స్టాక్ ఉన్నా.. మహారాష్ట్రకు సరఫరా చేయడం లేదన్నారు.
- రాజస్తాన్‌లో అర్బన్ ఏరియాల్లో రోజుకు రెండు గంటలు, రూరల్ ఏరియాల్లో నాలుగు గంటల చొప్పున కోతలు విధిస్తున్నట్లు అదనపు చీఫ్ సెక్రెటరీ సుబోధ్ అగర్వాల్ చెప్పారు. కోల్ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రావాల్సిన బొగ్గులో సగమే వస్తోందని తెలిపారు.
- ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో పీక్ అవర్స్‌లో పవర్ కట్స్ ఉంటున్నాయి. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య రెండు గంటలకు పైగా కోత విధిస్తున్నారు.
- కర్నాటకలోనూ కరెంటు కోతలు కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు విడతల వారీగా పవర్ కట్స్ ఉంటున్నాయి. బెంగళూరులో జోన్ల వారీగా కోతలు విధిస్తున్న విద్యుత్ పంపిణీ అధికారులు.. ఇందుకు సంబంధించిన వివరాలు ముందుగానే వెల్లడిస్తున్నారు.
- ప్రస్తుతం 100 మెగా వాట్ల పవర్ షార్టేజీ ఉందని, రాష్ట్రంలో కోతలు విధించే విషయమై ఈ నెల 19 తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేరళ పవర్ మినిస్టర్ కె.కృష్ణమూర్తి చెప్పారు.
- పంజాబ్‌లో చాలా చోట్ల 5 నుంచి 7 గంటలపాటు కరెంటు కోతలు విధిస్తున్నారు. కరెంటు సరిగ్గా సరఫరా చేయడం లేదంటూ పవర్ కార్పొరేషన్ ఎదుట రైతులు ధర్నాలు చేస్తున్నారు.
కేంద్ర మంత్రులతో ప్రధాని సమీక్ష
దేశంలో కోల్ క్రైసిస్ నేపథ్యంలో ప్రధాని మోడీని కేంద్ర మంత్రులు ఆర్కే సింగ్, ప్రహ్లాద్ జోషి కలిశారు. బొగ్గు సరఫరా పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. బొగ్గు నిల్వలు, కరెంటు సరఫరాపై మోడీకి విద్యుత్ శాఖ సెక్రటరీ అలోక్ కుమార్, కోల్ సెక్రెటరీ ఏకే జైన్ ప్రజెంటేషన్ ఇచ్చారు. విద్యుత్ ప్లాంట్లకు కోల్ రవాణా చేయడానికి రేక్‌లను అందుబాటులో ఉంచాలని రైల్వేలను కోల్ మినిస్ట్రీ కోరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. బొగ్గు నిల్వలు పెంచే పనుల్లో ప్రభుత్వం ఉందని, ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి ప్రహ్లాద్ జోషి కోరారు. వర్షాలు తగ్గాయని, బొగ్గు సరఫరా పెంచుతున్నామని చెప్పారు.
ఆ కరెంటు వాడుకోండి
సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల (సీజీఎస్)లో ‘కేటాయించని కరెంటు’ను ఉపయోగించుకోవచ్చని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. దేశంలో బొగ్గు కొరత ఉన్న నేపథ్యంలో రాష్ట్రాల ప్రస్తుత అవసరాలు తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘కొన్ని రాష్ట్రాలు వినియోగదారులకు కరెంటు సరఫరా చేయడం లేదని, కోతలు విధిస్తున్నాయని మాకు సమాచారం వచ్చింది. ఇదే సమయంలో కరెంటును పవర్ ఎక్స్చేంజీలకు అధిక రేట్లకు అమ్ముకుంటున్నాయని తెలిసింది” అని పవర్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘‘కరెంటు కేటాయింపు గైడ్‌లైన్స్ ప్రకారం.. సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల దగ్గర 15 శాతం కరెంటును ఏ రాష్ట్రానికి కేటాయించరు. అవసరంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే సరఫరా చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ కేటాయించని విద్యుత్‌ను రాష్ట్రాలు వాడుకోవచ్చు. వినియోగదారులకు కరెంటు సరఫరా చేయాల్సిన బాధ్యత పంపిణీ సంస్థలదే. 24x7 కరెంటు సరఫరా చేయాలి. అంతే తప్ప.. జనానికి కోతలు పెట్టి.. బయట అధిక ధరలకు కరెంటును అమ్ముకోకూడదు’’ అని అందులో స్పష్టం చేసింది. ఒకవేళ మిగులు విద్యుత్ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి సమాచారమివ్వాలని, అవసరమున్న రాష్ట్రాలకు ఆ పవర్‌ను కేటాయిస్తామని చెప్పింది. వినియోగదారులకు కోతలు పెట్టి.. కరెంటును ఎక్స్చేంజీలకు అమ్ముకుంటే.. ‘అన్ అలొకేటెడ్ పవర్’ సరఫరాను ఆపేసి, అవసరమున్న రాష్ట్రాలకు షెడ్యూల్ చేస్తామని స్పష్టం చేసింది.
బొగ్గు సరఫరా పెంచాలని కోల్ ఇండియాకు కేంద్రం ఆదేశాలు
బొగ్గు సరఫరాను పెంచాలని కోల్ ఇండియాకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రోజుకు 1.55 మిలియన్ టన్నుల నుంచి 1.6 మిలియన్ టన్నులను సరఫరా చేయాలని, ఈనెల 20 తర్వాత రోజుకు 1.7 మిలియన్ టన్నులను సప్లై చేయాలని చెప్పింది. ‘‘సోమవారం 1.95 మిలియన్ టన్నులను రవాణా చేశాం. ఇందులో 1.6 మిలియన్ టన్నులకు పైగా కోల్ ఇండియా నుంచి, మిగతాది సింగరేణి నుంచి సరఫరా చేశాం” అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. కోల్ బ్లాకుల వేలం సందర్భంగా ఆయన మాట్లాడారు. త్వరలోనే రోజుకు 2 మిలియన్ టన్నులను సప్లై చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. కోల్ ఇండియా వద్ద 22 రోజులకు సరపడా స్టాక్ ఉందని, సరఫరాను పెంచుతామని చెప్పారు.
బొగ్గు షార్టేజీకి ఐదు కారణాలు
- దేశంలో 70 శాతం కరెంటు ఉత్పత్తి బొగ్గు ద్వారానే జరుగుతోంది. ఇందులో మూడొంతుల బొగ్గును దేశంలోని గనులే సరఫరా చేస్తున్నాయి. సెప్టెంబర్‌లో మైన్ ఏరియాల్లో భారీ వర్షాలకు బొగ్గు ఉత్పత్తి పడిపోయింది. అప్పటికే తవ్విన బొగ్గు సరఫరాపైనా వర్షం ఎఫెక్ట్ పడింది.
- అంతర్జాతీయంగా కోల్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో బొగ్గు దిగుమతులపై ఆధారపడిన పవర్ ప్లాంట్లు కరెంటు ఉత్పత్తిని తగ్గించాయి. కొన్ని ప్రొడక్షనే నిలిపేశాయి. కొన్ని ఇంపోర్టెడ్ కోల్ ప్లాంట్లు 20 రోజులుగా మూతబడి ఉన్నాయి.
- వర్షాలు పడటానికి ముందే బొగ్గును నిల్వ చేసుకోవడంలో ప్లాంట్లు ఫెయిల్ అయ్యాయి.
- బొగ్గు కొంటున్న కంపెనీలు సకాలంలో డబ్బు చెల్లించడం లేదు. దీంతో భారీగా బకాయిలు పేరుకుపోయి సరఫరా నిలిచిపోయింది.
- కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఎకానమీ పుంజుకుంది. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు సహా అన్నీ ఓపెన్ అయ్యాయి. దీంతో కరెంటుకు డిమాండ్ భారీగా పెరిగింది. కానీ ఉత్పత్తి మాత్రం అందుకు తగినట్లు పెరగకపోగా.. తగ్గింది.
200 ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నయ్
మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మన రాష్ట్రంలో 200 ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కరెంట్ కోతలకు ఆస్కారం లేదని, ఒక్క నిమిషం కూడా కరెంట్ పోదని స్పష్టం చేశారు. మంగళవారం మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి మీడియాతో మాట్లాడారు. మన దగ్గర ఎలాంటి బొగ్గు కొరత, విద్యుత్ కోతలు లేవని, రానున్న రోజుల్లో కూడా ఇబ్బందులు రానివ్వమన్నారు. రాష్ర్టంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను హైదరాబాద్‌కు సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, మళ్లీ హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు సరఫరా చేసేలా గ్రిడ్ ఏర్పాటు చేశామని తెలిపారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం, మణుగూరులలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ తెలంగాణకు పూర్తిస్థాయిలో సరిపోతుందని మంత్రి చెప్పారు. గత ఏడాది 16 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ అవసరం కాగా, అంతే మొత్తంలో సరఫరా చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ సంస్థలను ప్రైవేట్‌కు అప్పగించేందుకే బొగ్గు కృత్రిమ కొరత అనే వార్తలు సృష్టిస్తున్నారని నిపుణులు అంటుంటే.. అది నిజమే అనిపిస్తుందన్నారు.