నిజామాబాద్: నిజామాబాద్ ప్రగతి ఆసుపత్రిలో దారుణం జరిగింది. మహిళ డెడ్ బాడీపై బంగారం మాయం చేసిన ఘటన కలకలం రేపింది. బంగారం కనిపించకుండా పోవడంతో చనిపోయిన ఆ వృద్ధురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. గంగవ్వ అనే పెద్దావిడ గుండె నొప్పి రావడంతో సోమవారం సాయంత్రం నిజామాబాద్ ప్రగతి ఆసుపత్రిలో ఆమెను చేర్పించారు.
మంగళవారం ఉదయం 8 గంటలకు చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఆసుపత్రి సిబ్బంది బంగారం అపహరించారని పోలీసులకు బంధువులు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఎవరు ఆ బంగారం దొంగిలించారనే విషయం తెలియలేదు.
►ALSO READ | అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం: సీఎం రేవంత్
వృద్ధురాలి ఒంటిపై ఉన్న 18 గ్రాముల బంగారం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో లొల్లిలొల్లి చేశారు. పోలీసులు ఆసుపత్రికి వచ్చి గంగవ్వ కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బంగారం మాయం చేసిందెవరో తేలేదాకా గంగవ్వ డెడ్ బాడీని అక్కడ నుంచి తీసుకెళ్లేది లేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు తెగేసి చెప్పారు. ఈ ఘటన నిజామాబాద్ టౌన్లో హాట్ టాపిక్ అయింది.
