నిజామాబాద్, వెలుగు: నగర పాలక సంస్థతో పాటు మూడు మున్సిపాలిటీల ఫలితాలు వెలువడడంతో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవుల కోసం పోటీ ప్రారంభమైంది. ఎవరికి వారు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. నగర పాలక సంస్థ మేయర్ పదవితో పాటు ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్ పదవులు జనరల్ మహిళకు రిజర్వ్ కాగా, బోధన్ చైర్‌పర్సన్ పోస్టు జనరల్‌కు కేటాయించారు.
అన్ని సామాజిక వర్గాలకు చెందిన మహిళలు, పురుషులకు అర్హత ఉండటంతో పోటీ తీవ్రంగా మారింది. ఏకాభిప్రాయం సాధించడంతో పాటు ఫిరాయింపులను అడ్డుకునేందుకు ప్రధాన పార్టీలు విజేతలను క్యాంపులకు తరలించాయి.
ఆర్మూర్, భీంగల్‌లో బీసీ మహిళల పరిశీలన...
ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల్లో పూర్తి ఆధిక్యం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఛైర్‌పర్సన్ పదవులకు బీసీ మహిళల పేర్లను పరిశీలిస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించిన కాంగ్రెస్, ఎన్నికల్లో 50 శాతానికి పైగా టికెట్లు ఆ వర్గానికి ఇచ్చింది. ఆర్మూర్‌లోని 36 వార్డుల్లో 19 గెలుచుకున్న కాంగ్రెస్‌లో ఇద్దరు మైనారిటీ మహిళలు సహా మొత్తం ఎనిమిది మంది మహిళా కౌన్సిలర్లు ఉన్నారు.
వారిలో బండారి గీత, తాటి నీలిమ, గోనె లహరి, బస్నాల్ తిరుమల ఛైర్‌పర్సన్ రేసులో ఉన్నారు. గోనె లహరి, బస్నాల్ తిరుమల పేర్లు బీసీ కోటాలో పరిశీలనలో ఉన్నాయి. గెలిచిన అభ్యర్థులను పార్టీ సెగ్మెంట్ ఇన్‌చార్జ్ వినయ్ రెడ్డి కామారెడ్డి శివారులోని ఫామ్‌హౌస్ క్యాంప్‌కు తరలించారు. భీంగల్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డుల్లో 8 వార్డులు కాంగ్రెస్ గెలుచుకుంది. అందులో నలుగురు మహిళలు ఉన్నారు. ఛైర్‌పర్సన్ పోస్టుకు బీసీ వర్గానికి చెందిన ఆరెపల్లి శ్రీజ, బొదిరే నాగమణి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఫలితాల అనంతరం నిజామాబాద్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌ను కలిసిన విజేతలను బాల్కొండ సెగ్మెంట్ ఇన్‌చార్జ్ సునీల్ రెడ్డి హైదరాబాద్‌ను క్యాంప్‌కు తరలించారు.
బోధన్‌లో ఒక్క ఓటుపై ఫోకస్..
38 వార్డులున్న బోధన్‌లో చైర్‌పర్సన్ పదవి కోసం 20 మంది బలం అవసరం. కాంగ్రెస్ 17 మంది కౌన్సిలర్లను గెలిపించుకుంది. కాంగ్రెస్ రెబల్‌గా గెలిచిన దివ్యను తమ శిబిరంలో చేర్చుకోవడంతో బలం 18కి చేరింది. ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు కలిస్తే సంఖ్య 19 అవుతుంది. మ్యాజిక్ ఫిగర్‌కు మరో ఓటు అవసరమవడంతో ఆ దిశగా కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. 12 మంది కౌన్సిలర్లను గెలిపించుకున్న మజ్లిస్ పార్టీ మద్దతు లభిస్తే పరిస్థితి సులభమవుతుంది. అయితే కాంగ్రెస్‌కు ఛైర్‌పర్సన్ దక్కకుండా బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే షకీల్ వ్యూహాలు రచిస్తున్నారు.
తన ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి, మజ్లిస్ విజేతలను క్యాంపులకు తరలించారు. కమలం గుర్తుపై గెలిచిన ముగ్గురు కౌన్సిలర్లను ప్రత్యర్థి పార్టీలకు చిక్కకుండా బీజేపీ నేత మేడపాటి ప్రకాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని తన స్టార్ హోటల్‌కు తరలించారు. కాంగ్రెస్ నుంచి ఛైర్‌పర్సన్ పోస్టుకు శరత్‌రెడ్డి, ఆయన భార్య తూము పద్మా, సీనియర్ కౌన్సిలర్ దాము, ఆదినారాయణ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నగర పాలక సంస్థలో నెలకొన్న గందరగోళంపై స్పష్టత వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మేయర్ రేసులో ఇద్దరు మహిళలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మేయర్ పదవి సాధిస్తే గోపడి స్రవంతి రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
