వేముల వాడ రాజన్న ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం.. 

వేముల వాడ రాజన్న ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం.. 

వేములవాడ రాజన్న ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమై కలకలం సృష్టించింది. పుణ్యక్షేత్రంలోని  వసతి గృహంలో హల్​ చల్​ చేసింది.. అనుకోకుండా దైవ క్షేత్రంలో నాగుపాము ప్రత్యక్షం కావడంతో అక్కడున్న వారంతా కొంత ఆందోళన, కొంత ఆశ్చర్యానికి గురయ్యారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని వసతి గృహంలో గురువారం (నవంబర్ 20) నాగుపాము ప్రత్యక్షమైంది. ఆలయంలోని పార్వతిపురం వసతి గృహంలో 13ఎ వసతి గదిని పోలీసులకు కేటాయించారు ఆలయ అధికారులు. గురువారం సాయంత్రం ఆ గదిలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులు నాగుపామును గమనించారు.  వెంటనే వారు ఆలయ సిబ్బందికి సమాచారం అందించారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే స్నేక్ క్యాచర్లకు పిలిపించారు.

దాదాపు గంటపాటు ఆ ప్రాంతంలో ఉన్న వారిని భయపెట్టిన నాగుపామును స్నేక్ క్యాచర్లు సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం నాగుపామును వేములవాడ శివారు ప్రాంతంలోని అడవిలో వదిలిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.