16 మంది దళితులపై కాఫీ తోట ఓనర్ దాష్టీకం

16 మంది దళితులపై కాఫీ తోట ఓనర్ దాష్టీకం

చిక్కమగళూరు: తన కాఫీ తోటలో పని చేస్తున్న కూలీలపై యజమాని దారుణానికి పాల్పడ్డాడు. 15 రోజులపాటు వారిని గదిలో బంధించి చిత్రహింసలు పెట్టాడు. అతడు కొట్టిన దెబ్బలకు ఓ మహిళకు గర్భస్రావమైంది. కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాలో జరిగిందీ దారుణ ఘటన. ప్రధాన నిందితుడు జగదీశ్ గౌడ, అతడి కొడుకు తిలక్ గౌడపై అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నారని, గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. బాధితురాలిని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. 

ఏం జరిగింది..
చిక్కమగళూరు జిల్లా జేనుగడ్డే గ్రామంలో కాఫీ తోటలో రోజు కూలీలుగా కొందరు పని చేస్తున్నారు. తమ ఓనర్ దగ్గర వారు రూ.9 లక్షల దాకా అప్పుగా తీసుకున్నారు. తిరిగి చెల్లించకపోవడంతో తోట యజమాని వారిని బంధించాడు. ‘‘8వ తేదీన కొందరు వ్యక్తులు బలెహొన్నూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తమ బంధువులను జగదీశ్ గౌడ హింసిస్తున్నాడని చెప్పారు. కానీ అదేరోజు వాళ్లు తమ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. తర్వాతి రోజు ఓ గర్భవతిని జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. తర్వాత చిక్కమగళూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఎస్పీ మాకు రిఫర్ చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం” సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఒకరు తెలిపారు. తాము ఘటనా స్థలికి వెళ్లామని, అక్కడ 8 నుంచి 10 మందిని ఒక రూమ్‌లో బంధించి ఉంచారని చెప్పారు. ఓనర్‌‌ను ప్రశ్నించిన తర్వాత వాళ్లను వదిలిపెట్టామని వెల్లడించారు.

తిడుతూ కొట్టిన్రు..
‘‘నన్ను ఒకరోజు ఇంట్లో బంధించారు. కొట్టారు. తిట్టారు. ఫోన్ లాక్కు న్నారు” అని అర్పిత అనే బాధితురాలు చెప్పింది. జగదీశ్‌ గౌడ కొట్టిన దెబ్బలకు ఆమెకు గర్భస్రావమైంది. ‘నా బిడ్డ 2 నెలల గర్భవతి. ఆమెను, నా అల్లుడిని జగదీశ్‌ తీవ్రంగా కొట్టాడు. దీంతో నా బిడ్డ గర్భం పోయింది’ అని బాధితురాలి తల్లి తెలిపింది.