వరదలకు కూలిపోయిన కాఫర్ డ్యాం హిమాచల్ ప్రదేశ్లో ఘటన

వరదలకు కూలిపోయిన కాఫర్ డ్యాం హిమాచల్ ప్రదేశ్లో ఘటన

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లోని కులూ జిల్లాలో మలానా 1 హైడ్రోపవర్  ప్రాజెక్టు కాఫర్  డ్యాం వరదలకు కూలిపోయింది. దీంతో డ్యాం నుంచి నీరు ఒక్కసారిగా ఎగిసిపడింది. డ్యాం సమీపంలో ఉన్న వాహనాలు, భారీ యంత్ర సామగ్రి నీళ్లలో కొట్టుకుపోయాయి. హైడ్రా క్రేన్, డంపర్  ట్రక్, రాక్  బ్రేకర్ తో పాటు డ్యాం దగ్గర పార్క్  చేసిన వెహికల్స్  కూడా ప్రవాహంలో కొట్టుకుపోయాయి. 

అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. హిమాచల్ ప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా భారీ వానలు కురుస్తున్నాయి. దీంతో వరదలు సంభవించాయి. కులూ జిల్లాలోని పార్వతి నదికి వరదలు పోటెత్తాయి. దీంతో ఈ వరదల ధాటికి మలానా 1 హైడ్రోపవర్  ప్రాజెక్టు డ్యాం కూలిపోయింది. డ్యాం కూలిపోవడం, నీటిలో వాహనాలు  కొట్టుకుపోవడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

అలాగే, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొండచరియలు కూడా విరిగి పడ్డాయి. మండి జిల్లాలోని పందో డ్యాం సమీపంలో చండీగఢ్, మనాలి హైవేపై కొండచరియలు విరిగిపడడంతో భారీగా ట్రాఫిక్  స్తంభించింది. ఈ హైవేలో 50 మీటర్ల మేర రోడ్డు కుంగిపోయింది. దీంతో చంబా, కులూ, మండి, ఉనాతో రవాణా సంబంధాలు తెగిపోయాయి. పోలీసులు, రెస్క్యు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డును క్లియర్  చేసే పనిలో ఉన్నారు.