
ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు స్టేడియంలో ఓ డాగ్ రోబో సందడి చేసింది. ఓసారి ధోని దాన్ని సరదాగా ఆటపట్టించాడు కూడా. అయితే.. ఇప్పుడు కోయంబత్తూరుకు చెందిన ఇద్దరు ఎలక్ట్రానిక్ ఇంజనీర్లు అలాంటి ఓ డాగ్ రోబోని తయారుచేశారు. ఏఐతో పనిచేయడం దీని ప్రత్యేకత. దీన్ని తయారుచేసిన రుద్రేష్, సూరజ్‌లు.. ఈ రోబో రెస్క్యూ ఆపరేషన్ల నుంచి ఇండస్ట్రియల్ ఇన్స్పెక్షన్స్ వరకూ అనేక రకాలుగా పనిచేస్తుందంటున్నారు.
‘‘మేము గతంలో కొన్ని ఇండస్ట్రీల్లో పనిచేశాం. అయితే.. కరోనా టైంలో మనవంతుగా సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే రకరకాల టెక్నాలజీల మీద ఎక్స్పరిమెంట్స్ చేయడం ప్రారంభించాం. మొదట్లో హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, రెస్టారెంట్లు లాంటి రంగాల కోసం హ్యూమనాయిడ్ రోబోలను డెవలప్ చేశాం. ఇప్పుడు ప్రమాదకరంగా ఉండే పరిస్థితులను ఎదుర్కోవడంలో మనుషులకు సాయపడే ఏఐ బేస్డ్ డాగ్ మీద పనిచేస్తున్నాం” అంటూ వాళ్ల జర్నీని చెప్పుకొచ్చారు. రోబో కెపాసిటీని వివరిస్తూ ‘‘ఈ రోబోను రెస్క్యూ మిషన్లు, సెక్యూరిటీ పెట్రోలింగ్, నిర్మాణ, మాన్యుఫాక్షరింగ్ ప్రదేశాల్లో తనిఖీలు చేయడానికి, బాంబు స్క్వాడ్‌లతోపాటు మనుషులకు సేఫ్టీ లేని ప్రదేశాల్లో ఎక్కడైనా ఉపయోగించేందుకు సిద్ధం చేస్తున్నాం” అన్నాడు రుద్రేష్.
ఈ రోబో కఠినమైన పరిస్థితులను తట్టుకోగలదు. ఐదు గంటల వరకు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది. అగ్నిప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సాయం చేయగలదు. ఒక పెంపుడు జంతువులా కూడా ఉంటుంది. దూకగలదు, పల్టీలు కొట్టగలదు. అయితే.. ప్రస్తుతం దాని కెపాసిటీని మరింత పెంచే పనిలో ఉన్నారు ఈ ఇంజినీర్లు. రాబోయే ఆరు నెలల్లో భూగర్భ తాగునీటి పైపులైన్లను పర్యవేక్షించడం, మురుగునీటి కాల్వలను పరిశీలించడం లాంటి పనులు చేసేలా దానికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ‘‘ప్రస్తుతం దీనికి 5 కిలోల పేలోడ్ కెపాసిటీ ఉంది. గంటకు 20 కి.మీ వేగంతో పరుగెత్తగలదు. ఇది 45 డిగ్రీల వాలు, 15 సెం.మీ. ఎత్తు ఉండే మెట్లు ఎక్కగలదు” అంటూ రోబో వివరాలను చెప్పాడు సూరజ్.