
చాలా సినిమాలు డిజిటల్ రిలీజ్‌కి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే నిజమవుతున్నాయి. చాలామంది నిర్మాతలు తమ సినిమాలు ఓటీటీలో రిలీజ్ కావడం లేదంటూ క్లారిటీ ఇస్తున్నారు. దాంతో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు ఏ సినిమా డిజిటల్ రిలీజ్ అవుతోందో నమ్మలేని పరిస్థితి. మలయాళ నటుడు, దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన ‘కోల్డ్ కేస్’ మూవీ విషయంలో కొద్ది రోజులుగా ఇలాంటి డైలమానే ఉంది. ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు నిర్మాత ఆంటో జోసెఫ్ ఆమధ్య చెప్పారు. కానీ ఎప్పుడనేది ఆయన చెప్పకపోవడంతో కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. కానీ ఇప్పుడది పోయింది. ఎందుకంటే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 30న రిలీజ్ చేస్తున్నట్లు నిన్న ప్రకటించారు. ఇది ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే కథ. పృథ్వి పోలీసాఫీరుగా కనిపిస్తాడు. అతని సరసన అదితి బాలన్ హీరోయిన్‌గా నటించింది. డైరెక్టర్‌గా మారిన సినిమాటోగ్రాఫర్ తనూ బాలక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంటుందని టీమ్ చెబుతోంది. త్వరలో థియేటర్లు తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నా, హండ్రెడ్ పర్సెంట్ ఆక్సుపెన్సీ ఉంటే తప్ప పెట్టుబడి పెట్టిన సొమ్ము తిరిగి రాదు. అందుకే ఓటీటీ రిలీజే బెస్ట్ అని ఫిక్సయినట్లు నిర్మాత చెబుతున్నారు. ఏదేమైతేనేం.. ఇన్ని రోజులకి ఈ మూవీ విడుదల విషయమై క్లారిటీ వచ్చింది.