జలుబు, ఆయాసం, దగ్గు తగ్గడానికి కొన్ని చిట్కాలు

జలుబు, ఆయాసం, దగ్గు తగ్గడానికి కొన్ని చిట్కాలు

తుమ్మినా.. దగ్గినా కరోనా వచ్చిందేమోనన్న భయాందోళనలు మనుషులను నిద్ర లేకుండా చేస్తున్నాయి. మొత్తం ప్రపంచమంతా ఎక్కడకు వెళ్లినా ఇదే పరిస్థితి. మన పక్కన ఎవరైనా తుమ్మినా.. దగ్గినా.. ఆయాసంతో ఇబ్బంది పడినా ఇదే అనుమానం. ఒకప్పుడు జలుబు చేస్తే.. మందులేసుకుంటే వారం రోజులు.. వేసుకోకుంటే ఏడ్రోజులు అని లైట్ తీసుకునేవారు. ఇప్పుడు మాత్రం విచిత్రమైన పరిస్థితి. కొన్నిచోట్ల అయితే మనుషులను వెలివేసిన వారిలా దూరంగా జరిగితే.. మరికొన్ని చోట్ల అలాంటి వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు పరిపాటి అయింది. ఇలాంటి  పరిస్థితి మనకు కూడా రాకూడదన్న భావన ప్రతి ఒక్కరిలోనూ పెరిగిపోయింది. ఇలాంటి వారి కోసం ప్రకృతిపరంగా లభించే వాటితో ఆరోగ్య సమస్యలను ఎలా తొలగించవచ్చో నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్.. కరోనా అంటూ భయాందోళనలకు గురయ్యేవారు సింపుల్ గా ఈ చిట్కాలు పాటించి వాటిని దూరం చేసుకోమని సూచిస్తున్నారు.

పొడి దగ్గు.. ఛాతీలో పట్టినట్లు ఉంటే..

పొడి దగ్గు.. ఈ సమస్య ఉన్న వారు మూడు కప్పుల నీల్లలో రెండు తమలపాకులు, నాలుగు మిరియాలు (పొడి) వేసి సిమ్ వేడిపై  15 నిమిషాలు మరగబెట్టి దింపాలి. ఈ మిశ్రమంలో చెంచాడు తేనె కలిపి ఉదయం.. సాయంత్రం తీసుకోవాలి.

ఇదే సమస్యకు మరో చిట్కా ఏమిటంటే.. గ్లాసు నీటిలో అర టీ స్పూన్ అల్లం తరుముకుని కొద్దిగా టీ యాకు, మూడు తులసి ఆకులు వేసి గ్యాస్ స్టవ్ ను సిమ్ లో పెట్టి కనీసం 10 నిమిషాలు మరిగించాలి. దీన్ని చల్లార్చుకుని తాగితే గొంతులో గరగరతోపాటు.. దగ్గు కూడా తగ్గిపోతుంది.

జలుబు.. దగ్గు ఉంటే..

ఒక గ్లాసు మరిగించిన పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే జలుబుతోపాటు దగ్గు నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. తులసి ఆకు నమిలినా.. నమలలేని వారు తులసి ఆకు రసం చప్పరించినా దగ్గు.. జలుబు రెండూ తగ్గిపోతాయి.

అరికాళ్ల మంటలు అని బాధపడే వారు గోరింటాకు పెట్టుకుని ఒక గంట ఆరాక కడిగేసుకుంటే చాలు. లేదా రాత్రి నిద్రపోయేముందు గోరింటాకు పెట్టుకుని పడుకుని.. తెల్లారక కడిగేసుకుంటే చాలు. ఇలా చేస్తే  రెండు రోజుల్లోనే అరికాళ్ల మంటలు తగ్గుముఖంపడతాయి. గోరింటాకు అందుబాటులో లేని వారు కనీసం సొరకాయ గుజ్జు.. లేదా నెయ్యి పూసుకుంటే మంచిది.

ఊపిరి పీల్చుకునే సమస్య ఉన్న వారు బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ లు అలవాటు చేసుకోవాలి. తరచూ ముక్కుతో నెమ్మదిగా గాలి పీల్చి.. కాసేపు అలాగే ఊపిరి బిగపట్టాలి. ముక్కుద్వారా పీల్చుకున్న గాలిని నెమ్మదిగా నోటి ద్వారా విడిచిపెట్టాలి. ఇలా నిదానంగా ముక్కుతో గట్టిగా గాలి పీల్చుకుని.. నోటి ద్వారా విడిచి పెడుతూ ఉండాలి.

 

నిలబడలేని వారు కూర్చునైనా దీన్ని ఆచరించవచ్చు. నిలబడగలిగే వారు.. రెండు కాళ్లపై నిటారుగా నిలబడి.. రెండు కాళ్ల మధ్య కనీసం అడుగు దూరం పెట్టి తల పైకెత్తి ఆకాశం వైపు చూడాలి. ఇలా ఆకాశం వైపు (ఇంట్లో అయితే సీలింగ్ వైపు) చూస్తూ.. నెమ్మదిగా ఊపిరి పీల్చుకుని.. ముక్కు ద్వారా పీల్చుకున్న గాలిని నోటి ద్వారా విడిచిపెట్టాలి. కనీసం ఐదారు నిమిషాలు చాలా కంఫర్ట్ గా ఉన్నప్పుడు  చేస్తే బెటర్.