రాష్ట్రంలో కొనసాగుతున్న చలి తీవ్రత

రాష్ట్రంలో కొనసాగుతున్న చలి తీవ్రత
  •     అత్యల్పంగా కుమ్రంభీం జిల్లాలో 7 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్లు
  •     పది జిల్లాల్లో సింగిల్ డిజిట్ నమోదు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతున్నది. శనివారం రాత్రి పది జిల్లాల్లో సింగిల్ డిజిట్​లోనే టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్​లో 7 డిగ్రీల టెంపరేచర్​నమోదైంది. ఆదిలాబాద్​ జిల్లా చాప్రాలలో 7.9 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహిర్​లో 8.9, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 9, కామారెడ్డి జిల్లా జుక్కల్​లో 9.1, నిజామాబాద్ జిల్లా సాలూరలో 9.5, వికారాబాద్​ జిల్లా మర్పల్లిలో 9.6, నిర్మల్​ జిల్లా పెంబిలో 9.6, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మౌలాలిలో 9.8, రాజన్న సిరిసిల్ల జిల్లా గజసింగారంలో10 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

మరో నాలుగు జిల్లాల్లో 10 డిగ్రీల రేంజ్​లో రికార్డయ్యాయి. కాగా, హైదరాబాద్​ సిటీ పరిధిలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వద్ద అత్యల్పంగా 9.8 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది. మౌలాలిలో 9.8 డిగ్రీలు నమోదైంది. అయితే, ప్రస్తుతం నైట్​ టెంపరేచర్లు క్రమంగా పెరుగుతున్నాయి. 

శ్రీలంక, తమిళనాడు తీరాల్లో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం అల్పపీడనంగా బలహీనపడింది. ఆ ప్రభావంతో మేఘాలు తెలంగాణవైపునకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో రెండు మూడు రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత వారం రోజుల వరకు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని పేర్కొంటున్నారు.